G. Kishan Reddy: కాంగ్రెస్ హయాంలో తెలంగాణకు అన్యాయం జరిగింది: కిషన్ రెడ్డి

  • కొమురవెల్లి ఆలయానికి సమీపంలో రైల్వే స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ 
  • మెదక్, సిద్దిపేట రైల్వే లైన్లను బీజేపీయే ఇచ్చిందన్న కిషన్ రెడ్డి
  • రీజినల్ రింగ్ రోడ్డు కోసం రూ.26 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తోందని వెల్లడి
Kishan Reddy blames congress over telangana development

కాంగ్రెస్ హయాంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. కొత్తపల్లి - మనోహరాబాద్ నూతన రైలు మార్గంలో సిద్దిపేట జిల్లా కొమురవెల్లి ఆలయానికి సమీపంలో రైల్వే స్టేషన్ నిర్మాణానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌తో కలిసి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణలో రైల్వే స్టేషన్లు తక్కువగా ఉన్నాయన్నారు. 2014 రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు రూ.250 కోట్లు కేటాయిస్తే, ఇప్పుడది రూ.6వేల కోట్లకు పెరిగిందని గుర్తు చేశారు. మెదక్, సిద్దిపేట రైల్వే లైన్లను కూడా బీజేపీ ప్రభుత్వమే ఇచ్చిందని గుర్తు చేశారు.

రీజినల్ రింగ్ రోడ్డు కోసం రూ.26 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తోందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణ చేయకుండా నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం భూసేకరణ చేస్తే వెంటనే ఆర్ఆర్ఆర్ పనులు ప్రారంభమవుతాయన్నారు. కాగా, కొమురవెల్లి వద్ద హాల్ట్ స్టేషన్ నిర్మించాలని గవర్నర్ తమిళిసై, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి భక్తులు వినతి పత్రాలు ఇచ్చారు. వీరు ఈ అంశాన్ని రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో ఆలయానికి మూడు కిలో మీటర్ల దూరంలో స్టేషన్‌ను మంజూరు చేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది.

More Telugu News