Euthanasia: చేతిలో చెయ్యేసి ఒకరినొకరు చూసుకుంటూ.. కారుణ్య మరణం పొందిన డచ్ మాజీ ప్రధాని దంపతులు

  • 93 ఏళ్ల వయసులో కారుణ్య మరణాన్ని ఎంచుకున్న అగ్ట్ దంపతులు
  • 1977 నుంచి 1982 వరకు ప్రధానిగా సేవలు
  • 93వ పుట్టిన రోజు జరుపుకొన్న మూడు రోజులకే మృతి
Former Dutch PM And Wife Die Via Duo Euthanasia

డచ్ మాజీ ప్రధాని డ్రైస్ వాన్ అగ్ట్, ఆయన భార్య యూజినీ ఇద్దరూ 93 ఏళ్ల వయసులో కారుణ్య మరణం (యూతనేషియా)తో కన్నుమూశారు. 1977 నుంచి 1982 వరకు నెదర్లాండ్స్‌కు ప్రధానిగా సేవలందించిన అగ్ట్ 93వ పుట్టిన రోజు జరుపుకొన్న మూడు రోజులకే స్వగ్రామమైన నిజ్‌మెగెన్‌లో కారుణ్య మరణం ద్వారా ప్రాణాలు విడిచారు. భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ చేతిలో చేయి వేసుకుని కారుణ్య మరణం పొందినట్టు ఆయన స్థాపించిన మానవహక్కుల సంఘం తెలిపింది. 

అగ్ట్ 2019లో బ్రెయిన్ హెమరేజ్ బారినపడ్డారు. చికిత్స తీసుకున్నప్పటికీ ఆయన దానిని నుంచి పూర్తిగా కోలుకోలేకపోయారు. ఇద్దరూ ఒకరిని విడిచి మరొకరు జీవించలేమని నిర్ణయించుకుని కారుణ్య మరణాన్ని ఎంచుకుని 70 ఏళ్ల పైబడిన దాంపత్య జీవితానికి ముగింపు పలికారు.

ఇటీవలి కాలంలో నెదర్లాండ్స్‌లో కారుణ్య మరణాలు ఎంచుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2002లో అక్కడ కారుణ్య మరణం చట్టబద్ధమైంది. అయితే, చట్టబద్ధంగా కారుణ్య మరణాన్ని ఎంచుకునే వారు అందుకు తగిన కారణాన్ని చూపించాల్సి ఉంటుంది. అంటే భరించలేని బాధలు, ఉపశమనం పొందే అవకాశం లేకపోవడం, దీర్ఘకాలంగా మరణం కోసం ఎదురుచూస్తుండడం వంటి కారణాలు చూపాల్సి ఉంటుంది. 

 కారుణ్య మరణం చట్టబద్ధమైన తర్వాత నుంచి డచ్‌లో ఇలాంటి కేసులు నాలుగింతలు పెరిగాయి. 2021లో 16 జంటలు కారుణ్య మరణం ద్వారా ప్రాణాలు విడిచిపెడితే 2022లో ఆ సంఖ్య 29కి పెరిగింది. 2020లో 13 జంటలు కారుణ్య మరణాన్ని ఎంచుకున్నాయి.

More Telugu News