Electoral Bonds: ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై నేడే సుప్రీంకోర్టు తీర్పు!

Supreme Courts Big Verdict On Electoral Bonds Scheme Today
  • 2018లో ఎలక్షన్ బాండ్స్ పథకం ప్రారంభం
  • ఈ పథకాన్ని సవాలు చేస్తూ సుప్రీంలో పిటిషన్లు
  • పిటిషన్లపై చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ
  • గత నవంబర్ 2న ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్ చేసిన న్యాయస్థానం
ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై సుప్రీం కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఎలక్టోరల్ బాండ్ల చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై గతేడాది నవంబర్‌లో వాదనలు ముగిసిన విషయం తెలిసిందే. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ కేసులో విచారణ జరిపి తీర్పు రిజర్వ్ చేసింది.  

రాజకీయ పార్టీల నిధుల సమీకరణకు ఉద్దేశించిన ఎన్నికల బాండ్ల పథకం చట్టబద్ధతను సవాలు చేస్తూ ఏడీఆర్, సీపీఎం సహా మరికొందరు పిటిషనర్లు సుప్రీంను ఆశ్రయించారు. 2024 సార్వత్రిక ఎన్నికలలోపే ఈ పథకంపై సమగ్ర విచారణ జరపాలని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అప్పట్లో సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీంతో, గతేడాది అక్టోబర్ 31న ఈ పిటిషన్లపై వాదనలు ప్రారంభమయ్యాయి. నవంబర్ 2న కోర్టు తన తీర్పు రిజర్వ్ చేసింది. 

మిటీ పథకం
రాజకీయ పార్టీలు పారదర్శకంగా నిధులు సమీకరించేందుకు వీలుగా 2018 జనవరి 2న ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా పార్టీలకు విరాళాలు ఇవ్వాలనుకున్న వారు ఎన్నికల బాండ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రూ.వెయ్యి నుంచి రూ.కోటి వరకూ వివిధ మొత్తాలకు ఎన్నికల బాండ్స్ జారీ చేస్తారు. ఇవి వివిధ ఎస్‌బీఐ బ్రాంచీల్లో కొనుగోలు చేయొచ్చు. భారత పౌరులు, భారత్‌లో స్థాపించిన లేదా ఇన్‌కార్పొరేట్ అయిన కంపెనీలు ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలు అందించవచ్చు. ఈ పథకంలో దాతల వివరాలు గోప్యంగా ఉంచుతారు. ప్రజలకు, పార్టీలకు కూడా ఈ దాతల వివరాలు వెల్లడించరు. అయితే, ఆడిటింగ్ అవసరాల కోసం ప్రభుత్వం, సంబంధిత బ్యాంకులు దాతల వివరాలు సేకరిస్తాయి. 

ఎన్నికల్లో కనీసం ఒక శాతం ఓట్లు పొందిన పార్టీలే ఈ పథకానికి అర్హులు. అధీకృత బ్యాంకుల్లోనే రాజకీయ పార్టీలు ఈ బాండ్లను క్యాష్ చేసుకోవాల్సి ఉంటుంది. 

పథకంపై అనుకూల, ప్రతికూల వాదనలు
ఎన్నికల బాండ్ల దాతల విషయంలో ఇంతటి గోప్యత పాటించడంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇది ప్రజల సమాచార హక్కును ఉల్లంఘించడమేనని స్పష్టం చేశాయి. ఈ పథకంతో దేశంలో అవినీతి రాజ్యమేలుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎలక్టోరల్ బాండ్స్ దాతలు ఎవరో బయటకు ఎందుకు చెప్పరని ప్రశ్నిస్తున్నాయి. రాజకీయ పార్టీలకూ తమ నిధుల మూలాలు దాచిపెట్టుకునే సౌలభ్యాన్ని ఈ పథకం ఇస్తోందని పిటిషనర్ల తరపున వాదించిన కపిల్ సిబల్ అన్నారు. 

ఎన్నికల విరాళాల్లో పారదర్శకతకు, నల్లధనం కట్టడికి ఈ పథకం ఉపయోగపడుతోందని ప్రభుత్వం వాదిస్తోంది. పన్నుల ఉల్లంఘనలకు తావుండదని అంటోంది. అయితే, ప్రజలకున్న సమాచార హక్కుకూ పరిమితులు ఉన్నాయని స్పష్టం చేసింది. సమాచార హక్కు అంటే ప్రజలకు అన్నీ తెలిసుండాలన్న అర్థం కాదని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సుప్రీం కోర్టులో వాదించారు. 
Electoral Bonds
Supreme Court

More Telugu News