Nara Lokesh: బొబ్బిలి సభలో "అమ్మా రజనీ" అంటూ నారా లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు

  • ఉమ్మడి విజయనగరం జిల్లాలో టీడీపీ శంఖారావం
  • బొబ్బిలి నియోజకవర్గంలో సభ
  • వాడీవేడిగా ప్రసంగించిన నారా లోకేశ్
Nara Lokesh satires on minister Rajini

బొబ్బిలి శంఖారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వాడీవేడిగా ప్రసంగించారు. ఉద్యమాల గడ్డ ఉత్తరాంధ్ర... పోరాటాల గడ్డ ఉత్తరాంధ్ర... పౌరుషాల పురిటిగడ్డ ఈ బొబ్బిలి అని అభివర్ణించారు. 

శ్రీ పైడితల్లి అమ్మవారున్న పుణ్యభూమి ఈ ఉమ్మడి విజయనగరం జిల్లా... మన్యంపులి అల్లూరి సీతారామరాజు నడిచిన నేల ఈ విజయనగరం జిల్లా అని కొనియాడారు. ఇంతటి పవిత్ర భూమిపై, చరిత్ర ఉన్న గడ్డపై నిలబడి మీ ముందు మాట్లాడటం నా అదృష్టం అని నారా లోకేశ్ తెలిపారు. 

తాడేపల్లి కొంపలో మియావ్ అనే పిల్లి ఉందని, మనమంతా గట్టిగా పోరాడితే మియావ్ అనే పిల్లి అక్కడి నుండి పారిపోతుందని ఎద్దేవా చేశారు. 

జగన్ కు లూజ్ మోషన్స్

జగన్ కు ఒక కొత్త జబ్బు వచ్చింది. అందుకే ఎప్పుడన్నా ఈ మధ్య బయటకు వచ్చాడా? జగన్ కు లూజ్ మోషన్స్ పట్టుకున్నాయి. తాడేపల్లి మున్సిపల్ అధికారులను అడిగా... ఎందుకు జగన్ బయటకు రావడం లేదు అని. ఈ ప్రభుత్వం సరఫరా చేసే నీరు తాగి లూజ్ మోషన్స్ వచ్చాయని వారు చెబుతున్నారు. 

ఈ ప్రభుత్వానిది చెత్త పాలన. గుంటూరులో ప్రభుత్వం సరఫరా చేసే నీళ్లు తాగి ఎంతో మంది అనారోగ్యం పాలయ్యారు. డయేరియా వల్ల ఇద్దరు చనిపోయారు. వందలమంది ఆసుపత్రిలో చేరారు.

వైసీపీలో చేరాక జగన్ నాటిన గంజాయి మొక్క అయ్యావా?

ఆరోగ్య శాఖ మంత్రి రజనీని అడుగుతున్నా... అమ్మా రజనీ... నాడు మహానాడులో చంద్రబాబు నాటిన తులసి మొక్కనని చెప్పుకున్నావ్... మరి వైసీపీలో చేరాక జగన్ నాటిన గంజాయి మొక్కగా ఎలా మారారమ్మా? సీఎం జగన్ ఇప్పుడు పవన్ లాగా సినిమాల్లో పోటీ పడాలనుకుంటున్నారు. అందుకే సినిమాల పిచ్చి ఎక్కువైంది. యాత్ర-2 అని సినిమా తీశారు.

కష్టాలు తీర్చే సూపర్-6

ప్రజలు పడుతున్న కష్టాలు నేరుగా చూశాం. అందుకే చంద్రబాబు, పవన్ కలిసి సూపర్-6 ప్రకటించారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం. ఉద్యోగం వచ్చేదాకా రూ.3 వేలు భృతి ఇస్తాం. స్కూల్ కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా రూ.15 వేలు ఇస్తాం. 

18-59 ఏళ్ల వయసున్న మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తాం. ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తాం. రైతుకు ఏడాదికి రూ.20 వేల పెట్టుబడి సాయం అందిస్తాం. మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే హక్కు కల్పిస్తాం. 

ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్! 

మూడు రాజధానులు అన్నాడు... ఒక్క ఇటుకన్నా ఉత్తరాంధ్రలో వేశాడా..? ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం ఈ జగన్. బొబ్బిలి నియోజకవర్గంలో సుజయకృష్ణ రంగారావు మంత్రిగా ఉన్నప్పుడు అద్భుతంగా అభివృద్ది చేశారు. రోడ్లు, బ్రిడ్జిలు, ఇళ్లు, బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు అభివృద్ధి చేశారు. కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే గురించి మాట్లాడే పరిస్థితి లేదు. పక్క నియోజకవర్గాల్లో కనీసం ఇంకు పెన్ను ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఈ నియోజకవర్గంలో పెన్నుకు ఇంకును మరొకరు పోసే పరిస్థితి. 

బొబ్బిలి ప్రాంతంలో క్యాన్సర్ ఆసుపత్రి తీసుకువస్తాం

మన జిల్లాకు క్యాన్సర్ ఆసుపత్రి తీసుకురావాల్సిన అవసరం ఉంది. నా ముద్దుల మావయ్య, మీ అందరి బాలయ్య హైదరాబాద్ లో క్యాన్సర్ ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. నా భార్య బ్రాహ్మణి కూడా చెప్తోంది... హైదరాబాద్ కు ఏపీ నుండి క్యాన్సర్ పేషెంట్లు వస్తున్నారని చెప్పింది. ఎన్జీవో లేదా ప్రభుత్వం తరపున క్యాన్సర్ ఆసుపత్రి ఇక్కడ ఏర్పాటు చేస్తాం. లైబ్రరీ కూడా ఏర్పాటు చేస్తా.
 
ఆనాడు పవన్ ఒక్కటే నిర్ణయించుకున్నారు

చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు పవన్ కల్యాణ్ నాకు ఫోన్ చేశారు. ఒక అన్నగా అండగా ఉంటానని చెప్పారు. నాడు పవన్ ఏపీకి రావాలనుకుంటే విమానానికి అనుమతి రాకుండా చేశారు. రోడ్డు మార్గాన వస్తుంటే రాకుండా అడ్డుకున్నారు. ఆనాడు పవన్ ఒక్కటే నిర్ణయించుకున్నారు ఈ సైకోను తరిమికొట్టాలని సంకల్పించారు.  

టీడీపీ, జనసేన కార్యకర్తలు కలిసి పనిచేయాలి. ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలి. పేటియం కుక్కలు విభేదాలు పెట్టడానికి రెడీగా ఉన్నాయి. సూపర్-6 పథకాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. హామీల గురించి వివరించి చెప్పాలి. అందరి నినాదం... హలో ఏపీ... బైబై వైసీపీ కావాలి.

More Telugu News