BRS MLAs: మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తత

  • సభ నుంచి వాకౌట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
  • మీడియా పాయింట్ వద్ద మాట్లాడేందుకు అనుమతి లేదన్న పోలీసులు
  • అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
Police not allowed BRS MLAs to go to Assembly media point

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు గందరగోళంగా జరిగాయి. నిన్న నల్గొండ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో నిప్పులు చెరిగారు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఏం పీకడానికి వెళ్లాడు అని అంటాడా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ను చంపాల్సిన అవసరం తమకెందుకుంటుందని అన్నారు. కేసీఆర్ ఇప్పటికే ఒక చచ్చిన పాము అని... చచ్చిన పామును మళ్లీ చంపాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ క్రమంలో అధికార, విపక్ష పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అధికార పార్టీ తీరును వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. 

మరోవైపు, సభ నుంచి బయటకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడేందుకు వెళ్తుండగా... పోలీసులు వారిని అడ్డుకున్నారు. సభ జరుగుతున్న సమయంలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడకూడదని వారికి పోలీసులు చెప్పారు. కొత్తగా ఈ నిబంధన ఎప్పుడొచ్చిందని పోలీసులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాగ్వాదానికి దిగారు. 

మీడియా పాయింట్ వద్ద బ్యారికేడ్లు పెట్టడంపై మండిపడ్డారు. పోలీసుల తీరును నిరసిస్తూ అక్కడే బైఠాయించారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. మీడియా పాయింట్ వద్ద మాట్లాడేందుకు అనుమతిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కూడా ఆపుతారా? అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఆవరణలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

More Telugu News