YS Sharmila: జగనన్న, సకలం శాఖ మంత్రులకు దమ్ముంటే ఈ 9 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి: షర్మిల

  • నిన్న డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
  • 6,100 పోస్టుల భర్తీకి ప్రకటన
  • 25 వేల పోస్టుల మెగా డీఎస్సీ ఏమైందన్న షర్మిల
Sharmila challenges Jagan and his aides

ఏపీ ప్రభుత్వం నిన్న 6,100 టీచర్ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. మహానేత వైఎస్సార్ నాడు 52 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తే, వారసుడిగా చెప్పుకునే జగనన్న 6 వేల పోస్టులతో వేసింది దగా డీఎస్సీ అని విమర్శించారు. ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలు చేసే వైసీపీ, వాళ్లను మోసే సోషల్ మీడియాకు ఒక సవాల్ అంటూ షర్మిల 9 ప్రశ్నలు సంధించారు.

1. రాష్ట్రంలో 25 వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తామని గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు... ఆ మెగా డీఎస్సీ ఎక్కడ?
2. ఐదేళ్ల పాటు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎందుకు కాలయాపన చేశారు?
3. ఎన్నికలకు ఒకటిన్నర నెల ముందు 6 వేల పోస్టులు భర్తీ చేయడంలో ఆంతర్యం ఏమిటి?
4. టెట్, డీఎస్సీలకు కలిపి నోటిఫికేషన్ ఇస్తే అభ్యర్థులు వీటిలో దేనికి సన్నద్ధం కావాలి?'
5. నోటిఫికేషన్ ఇచ్చిన 30 రోజుల్లోనే పరీక్షలు జరపడం దేశంలో ఎక్కడైనా ఉందా? నోటిఫికేషన్ తర్వాత టెట్ కు 20 రోజుల సమయం ఉంటే, టెట్ కు డీఎస్సీకి మధ్య 6 రోజుల వ్యవధి మాత్రమేనా?
6. నాడు వైఎస్సార్ హయాంలో డీఎస్సీ నోటిఫికేషన్ తర్వాత పరీక్షకు 100 రోజులు గడువు ఇచ్చిన సంగతి వారసుడు జగన్ కు గుర్తులేదా?
7. ఇచ్చిన సిలబస్ ప్రకారం ఒక్కో అభ్యర్థి 150 పుస్తకాలు చదవాలని మీకు తెలియదా?
8. రోజుకు 5 పుస్తకాలు చదవడం అభ్యర్థులకు సాధ్యమయ్యే పనేనా?
9. మానసిక ఒత్తిడికి గురి చేసి నిరుద్యోగులను పొట్టనబెట్టుకోవాలని కుట్ర చేస్తున్నారా? ఇది కక్ష సాధింపు చర్య కాదా? 

నవరత్నాలు జాతి రత్నాలు అని చెప్పుకునే జగనన్న, ఆయన చుట్టూ ఉండే సకలం శాఖ మంత్రులు దమ్ముంటే ఈ 9 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి... అంటూ షర్మిల సవాల్ విసిరారు.

More Telugu News