Medigadda: చిన్న సంఘటనను భూతద్దంలో చూస్తున్నారు.. మేడిగడ్డ బ్యారేజీ వివాదంపై హరీశ్ రావు

  • గత ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నమే ఇదంటూ మాజీ మంత్రి ఫైర్
  • కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటే కాదన్న హరీశ్ రావు
  • పిల్లర్లు కుంగితే పెద్ద ఇష్యూ చేస్తున్నారన్న బీఆర్ఎస్ నేత
Telangana Former Minister Harish Rao Press Meet On Medigadda Issue

మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడం చిన్న విషయమని, దానిని భూతద్దంలో పెట్టి ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రభుత్వంపై మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక్క మేడిగడ్డ బ్యారేజీ మాత్రమే కాదని చెప్పారు. మిగతా బ్యారేజీలను కూడా చూడాలని, కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులకు జరిగిన మేలును కూడా ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం చేపట్టిన మేడిగడ్డ సందర్శన యాత్రపై హరీశ్ రావు అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ తప్పులను కప్పి పుచ్చుకోవడానికి, నల్గొండలో బీఆర్ఎస్ నిర్వహించనున్న సభ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ యాత్ర చేపట్టిందని మండిపడ్డారు.

మేడిగడ్డను ఇప్పటికే ఐదుగురు మంత్రులు సందర్శించారని, కేంద్ర ప్రభుత్వ నిపుణుల కమిటీ కూడా పరిశీలించిందని హరీశ్ రావు గుర్తుచేశారు. ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అక్కడికి వెళ్లి చేసేదేముందని ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన విషయంపై అనవసర రాద్ధాంతం చేయకుండా సమస్యను పరిష్కరించే మార్గం చూడాలని ప్రభుత్వానికి హితవు పలికారు. వచ్చే వర్షాకాలంలోగా బ్యారేజీని పునరుద్ధరించేందుకు ప్రయత్నించాలని, పంట పొలాలకు నీరందించే మార్గం చూడాలని చెప్పారు. 

భారీ ప్రాజెక్టులు నిర్మించినపుడు చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయని, వాటినే పట్టుకుని పెద్దవిగా చూపే ప్రయత్నం చేయడం తగదని ప్రభుత్వానికి సూచించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై తప్పకుండా విచారణ జరిపించాలని, బీఆర్ఎస్ పార్టీ విచారణను వద్దని చెప్పడంలేదని అన్నారు. విచారణ జరిపించి బాధ్యులపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి హరీశ్ రావు చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయని, హైదరాబాద్ లోని పంజాగుట్ట ప్లై ఓవర్ కడుతుండగానే కూలిపోయి ఇరవై మంది చనిపోయిన సంఘటనను హరీశ్ రావు గుర్తుచేశారు.


More Telugu News