SpiceJet: స్పైస్‌జెట్‌లో కొలువుల కోత.. 1400 మందిని ఇంటికి పంపుతున్న ఎయిర్‌లైన్ సంస్థ

Low Cost Airline SpiceJet To Lay Off 1400 Employees
  • ఏడాదికి రూ. 100 కోట్లు ఆదా చేయడమే లక్ష్యం
  • జనవరి నెల వేతనాల కోసం ఉద్యోగుల ఎదురుచూపులు
  • ఇప్పటికే తొలగింపు నోటీసుల జారీ
  • పెట్టుబడులు పెట్టేందుకు వెనకాడుతున్న ఇన్వెస్టర్లు
ఉద్యోగులకు సమయానికి వేతనాలు చెల్లించలేనంత ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న చవక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ కొలువుల కోత మొదలుపెట్టింది. నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా తమ మొత్తం ఉద్యోగుల్లో 15 శాతం అంటే దాదాపు 1400 మందిని ఇంటికి పంపేందుకు సిద్ధమైంది. తమ టర్న్ అరౌండ్ ఖర్చులు తగ్గించుకునే వ్యూహంలో భాగంగా లాభదాయక వృద్ధి సాధించడం, భారతీయ విమానయాన పరిశ్రమలోని అవకాశాలను ఉపయోగించుకునేందుకు తమను తాము నిలబెట్టుకోవడం కోసం స్పైస్‌జెట్ హేతుబద్ధీకరణ సహా అనేక చర్యలు ప్రారంభించిందని, దీని ద్వారా ఏడాదికి రూ. 100 కోట్ల వరకు ఆదా చేసుకోవచ్చని అంచనా వేస్తున్నట్టు సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.

స్పైస్‌జెట్‌లో ప్రస్తుతం 9 వేల మంది ఉద్యోగులున్నారు. 30 విమానాలు నిర్వహిస్తోంది. వేతనాల కోసం రూ.60 కోట్లు ఖర్చు చేస్తుండగా దానిని తగ్గించుకునే వ్యూహంలో స్పైస్‌జెట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది ఉద్యోగులకు తొలగింపు నోటీసులు జారీచేసినట్టు సమాచారం.

స్పైస్‌జెట్ గత కొన్ని నెలలుగా వేతనాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. జనవరి నెల జీతాల కోసం ఇప్పటికీ కొందరు ఎదురుచూస్తున్నారు. రూ.2 వేల కోట్ల నిధుల కోసం సంస్థ ప్రయత్నాల్లో ఉంది. అయితే, పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు వెనకాడుతున్నారు.

2019లో స్పైస్‌జెట్ 118 విమానాలు, 16 వేల మంది ఉద్యోగులను కలిగి ఉంది. దాని సమీప ప్రత్యర్థి ఆకాశ ఎయిర్ 3,500 మంది ఉద్యోగులతో 23 విమానాలు నిర్వహిస్తోంది. దేశీయ విమాన మార్కెట్‌లో దాదాపు 4 శాతం వాటాను కలిగి ఉంది.
SpiceJet
Lay Offs
Low Cost Airline
Business News

More Telugu News