Ajay Maken: రాజ్యసభకు మాకెన్.. తెలంగాణ నుంచి నామినేషన్!

  • తెలంగాణ నుంచి ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులకు ఛాన్స్
  • రాజ్యసభ ఎన్నికల్లో రాష్ట్ర కోటా కింద ఏఐసీసీ సభ్యుడిని ఎంపిక చేసే ఛాన్స్
  • ఈ నెల 15న హైదరాబాద్‌కు ఏఐసీసీ సభ్యుడు మాకెన్ రాక
  • అదే రోజు ఆయన ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయొచ్చంటున్న పార్టీ వర్గాలు
Ajay maken to be nominated to RS from Telangana

ఏఐసీసీ కోశాధికారి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి అజెయ్ మాకెన్‌ను తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎంపిక చేయాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థులను మంగళ, బుధవారాల్లో అధిష్ఠానం ప్రకటించనుంది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 15 చివరి తేది. మరోవైపు, అదే రోజున మాకెన్ హైదరాబాద్ రానున్నారు. ఈ నేపథ్యంలో అధిష్ఠానం ఆయనను ఎంపిక చేస్తే మాకెన్ అదే రోజున నామినేషన్ దాఖలు చేయొచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో మాకెన్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించారు. 

తెలంగాణ శాసన సభలో కాంగ్రెస్‌కున్న బలం ప్రకారం రెండు రాజ్యసభ సీట్లు దక్కనున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐసీసీ నుంచి ఒక అభ్యర్థిని ఎంపిక చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇక మాకెన్ జనరల్ కేటగిరీకి చెందిన వారు కాబట్టి రాష్ట్ర కోటాలో వెనుకబడిన వర్గాల వారికి టికెట్ ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనపై కూడా పార్టీ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో మాజీ ఎంపీ వీహెచ్‌తో పాటు, పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్, మాజీ ఉపాధ్యక్షుడు నాగయ్య తదితరుల పేర్లు తెరపైకి వచ్చాయి. మరోవైపు మాజీ ఎంపీ రేణుకా చౌదరి, మాజీ మంత్రులు జానారెడ్డి, చిన్నారెడ్డి కూడా టిక్కెట్ కోసం తమ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

More Telugu News