Prudhvi Raj: ఉత్సవాల్లో ఎక్కడ చూసినా నేనే కనిపిస్తుండడంతో కొందరు ఓర్వలేకపోయారు: పృథ్వీరాజ్

  • గతంలో ఎస్వీబీసీ చైర్మన్ పదవిని చేపట్టిన నటుడు పృథ్వీరాజ్
  • అనూహ్య రీతిలో కొన్ని నెలలకే పదవిని కోల్పోయిన వైనం
  • ఓ దశలో సినిమాలు లేక ఇబ్బంది పడిన పృథ్వీరాజ్
  • ప్రస్తుతం సినిమాలతో మళ్లీ బిజీ
  • ఇటీవలే జనసేనలో చేరిక 
Actor Prudhvi Raj reveals interesting facts

గతంలో వైసీపీలో ఉన్న టాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్ అప్పట్లో ఎస్వీబీసీ చైర్మన్ పదవి చేపట్టారు. అయితే, అనూహ్య పరిణామాలతో కొన్ని నెలల్లోనే ఆ పదవి నుంచి తప్పుకోవడమే కాదు, వైసీపీకి కూడా దూరమయ్యారు. ఓ దశలో అటు రాజకీయంగా అవకాశాలు లేక, ఇటు సినిమా చాన్సులు రాక రెంటికి చెడ్డ రేవడిలా మిగిలిపోయారు! 

అయితే, క్రమంగా మళ్లీ సినీ రంగం అతడిని అక్కున చేర్చుకోవడంతో కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవలే జనసేన పార్టీలో చేరిన పృథ్వీరాజ్ ప్రస్తుతం పూర్తి ఉత్సాహంతో ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు వెల్లడించారు. 

ఎస్వీబీసీ చైర్మన్ గా పనిచేసిన కాలంలో కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేశానని తెలిపారు. ఆ సమయంలోనే బ్రహ్మోత్సవాలు వచ్చాయని, ఆ ఉత్సవాల నిర్వహణ తనకు వ్యక్తిగతంగా చాలా సంతోషాన్నిచ్చిందని వివరించారు. కానీ ఆ ఉత్సవాల్లో ఎక్కడ చూసినా నేను కనిపించడాన్ని కొందరు ఓర్వలేకపోయారు... అక్కడ్నించి వివాదాలు సృష్టించడం మొదలుపెట్టారు అని పృథ్వీ వెల్లడించారు. 

"ఆ సమయంలో నాపై ఆరోపణలు వచ్చాయి. అందరూ ఒక కోణంలోనే చూడడం మొదలుపెట్టారు. దాంతో నేను, మా ఆవిడ కలిసి ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లాం. మా ఆయన తప్పు చేస్తే నేనే పోలీసులకు పట్టిస్తాను అని మా ఆవిడ సీఎంతో చెప్పింది. అందుకాయన... మాట్లాడుదాం అమ్మా అంటూ బదులిచ్చే ప్రయత్నం చేశారు. మాకు ఇంకేమీ వద్దండీ అంటూ నమస్కారం పెట్టి అక్కడ్నించి వచ్చేశాం. ఆ తర్వాత రాజీనామా చేశాను. 

కరోనా టైమ్ లో సెకండ్ వేవ్ వచ్చినప్పుడు నాకు కూడా సోకింది. కరోనా పాజిటివ్ రావడంతో ఆసుపత్రి బెడ్ కోసం తీవ్రంగా ప్రయత్నించాల్సి వచ్చింది. ఆసుపత్రిలో బెడ్ కావాలని సీఎం కార్యాలయానికి ఫోన్ చేస్తే ఎవరూ స్పందించలేదు. ఆ సమయంలో నాకు అండగా నాగబాబు, సాయికుమార్ నిలిచారు. నేను కష్టాల్లో ఉంటే ఆదుకుంది చిత్ర పరిశ్రమే. 

నా కుమార్తెను పరిచయం చేస్తూ సినిమా చేశాను. దర్శకుడిగా నేను సినిమా చేస్తుంటే ఎవరూ నాకు మద్దతుగా నిలవకపోతే పవన్ కల్యాణ్ ఆదుకున్నారు. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను, ఎప్పటికీ ఆయనతోనే ఉంటాను" అని పృథ్వీరాజ్ వివరించారు. 

కాగా, తన అసలు పేరు మూర్తి శేషు అని పృథ్వీరాజ్ వెల్లడించారు. సీనియర్ నటుడు ప్రభాకర్ రెడ్డి తనపేరును పృథ్వీరాజ్ గా మార్చారని తెలిపారు.

More Telugu News