Revanth Reddy: కరీంనగర్ ప్రజలు తరిమికొడితే పాలమూరు వలస వచ్చారు: కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి విసుర్లు

  • కృష్ణా జలాలపై చర్చ సాగుతుంటే కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారని ఆరోపణ
  • ఏపీకి, కేంద్రానికి ఒక సందేశం పంపించాల్సిన సందర్భంలో ప్రతిపక్ష నేత సభకు రాలేదని ఆగ్రహం
  • ప్రతిపక్ష నేతగా పద్మారావుకైనా బాధ్యతలు అప్పగించాలని రేవంత్ రెడ్డి సూచన
  • బీఆర్ఎస్ దొంగబుద్ధి మానుకొని... తెలంగాణ బుద్ధి తెచ్చుకోవాలని సూచన
CM Revanth Reddy hot comments on kcr

ఒకాయనను 2009లో కరీంనగర్ ప్రజలు తరిమికొడితే అక్కడి నుంచి పారిపోయి పాలమూరు జిల్లాకు వలస వచ్చారని, మహబూబ్ నగర్ వాసులు ఆయనను ఎంపీగా గెలిపించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. కృష్ణా జలాలపై చర్చ సందర్భంగా హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అసెంబ్లీలో హరీశ్ రావు పచ్చి అబద్దాలు మాట్లాడారని మండిపడ్డారు. అసెంబ్లీలో కృష్ణా జలాలపై చర్చ సాగుతుంటే ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ చర్చలో పాల్గొనకుండా ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారని ఆరోపించారు. 

దక్షిణ తెలంగాణ కృష్ణా జలాలపై ఆధారపడి ఉందన్నారు. తెలంగాణ సమాజానికి వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించేది లేదని, కృష్ణా జలాల్లో 68 శాతం వాటా తెలంగాణకు ఇవ్వాల్సిందేనని ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు... ప్రధాన ప్రతిపక్ష నేత హుందాగా సభకు వచ్చి మద్దతు పలకాల్సింది అన్నారు. మనం తెలంగాణ హక్కులు, తెలంగాణ నీటి కోసం ఒకే మాట మీద నిలబడ్డామని... ఆంధ్రప్రదేశ్‌కు, కేంద్రానికి ఒక సందేశాన్ని పంపించాల్సిన సందర్భంలో ప్రతిపక్ష నేత సభకు రాకుండా ఫామ్ హౌస్‌లో దాక్కున్నారని విమర్శించారు.

పద్మారావుకు ప్రతిపక్ష నేత బాధ్యతలు అప్పగించాలి

ప్రతిపక్ష నేత కుర్చీ మొన్న ఖాళీగా ఉందని... ఇప్పుడు అక్కడ పద్మారావు కూర్చున్నారని, కనీసం వారికైనా ప్రతిపక్ష నేతగా బాధ్యతలు అప్పగిస్తే వారు ఆ బాధ్యతలు నెరవేరుస్తారన్నారు. దయచేసి ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు బాధ్యతలు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. పద్మారావు నిజమైన తెలంగాణవాది... తెలంగాణ కోసం కొట్లాడే వ్యక్తి... అలాంటి వారిని ప్రతిపక్షనేతగా పెడితే తెలంగాణ సమాజానికి ఉపయోగం ఉంటుందన్నారు.

దొంగబుద్ధి మానుకోవాలి

  ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం లేదు అనే అంశంపైనా, 68 టీఎంసీల నీళ్లు తెలంగాణకు రావాలనే అంశంపైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి తీర్మానం చేశారని... ఈ తీర్మానాలకు బీఆర్ఎస్ అనుకూలమా? వ్యతిరేకమా? చెప్పాలని ముఖ్యమంత్రి నిలదీశారు. ఈ విషయంలో స్పష్టత ఇచ్చాక మిగతా విషయలు మాట్లాడవచ్చునని చెప్పారు. అంతేకానీ వారి (బీఆర్ఎస్) మాటల వల్ల శత్రువులకు బలం చేకూరుతుందని, శత్రువులకు... దొంగలకు సద్దిమూట మోసే విధానం మంచిది కాదని... ఇప్పటికైనా దొంగబుద్ధి మార్చుకొని తెలంగాణ బుద్ధి తెచ్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని సీఎం అన్నారు.

More Telugu News