Ganta Srinivasa Rao: క్యాష్ అంతా ఎక్కడికి చేరుతుంది జగనన్న?: గంటా శ్రీనివాస రావు

  • రాష్ట్రంలోని మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్‌కు అవకాశం లేదన్న టీడీపీ సీనియర్ నేత
  • అంతా క్యాష్ మయంగా మారిందని ఆరోపణ
  • నాసిరకం మద్యం విక్రయించి పేదోడిని దోపిడీ చేస్తున్నారంటూ సీఎం జగన్‌పై గంటా శ్రీనివాసరావు మండిపాటు
Ganta Srinivasa Rao fires on YS Jagan Govt as all cash payments in Wine network shops

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు మరోసారి మండిపడ్డారు. రాష్ట్రంలోని మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్‌కు అవకాశం లేదని, అంతా క్యాష్ మయంగా మారిందని ఆరోపించారు. ‘‘ఈ రహస్యం ఏంటి? ఈ క్యాష్ అంతా ఎక్కడికి చేరుతుంది జగనన్న?’’ అని ఆయన ప్రశ్నించారు. టీ స్టాల్ దగ్గర నుంచి కిళ్లీ కొట్టు వరకు ప్రపంచం అంతా డిజిటల్‌గా మారిపోయిందని, కానీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నడిపే మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్‌కు అవకాశం లేదని ధ్వజమెత్తారు. అంతా క్యాష్ మయంగా మారిపోయిందని, వీటికి లెక్కా పత్రాలు ఏమైనా ఉన్నాయా? అని నిలదీశారు.

విచ్చలవిడిగా నాసిరకం మద్యం విక్రయించి పేదోడిని దోపిడీ చేస్తున్న ఇలాంటి ముఖ్యమంత్రి చరిత్ర తిరగేసినా దొరకరేమోనని గంటా శ్రీనివాస రావు ఆరోపించారు. ‘‘ రేట్లు సంగతి దేవుడెరుగు. బ్రాండ్‌లన్నీ మార్చారు. ప్రీమియం పేరును మాయం చేశారు. నికార్సైన సరుకుకు ఏనాడో స్వస్తి పలికారు. ఐదేళ్లుగా 'జే' బ్రాండులతో హానికర కిక్‌ను నింపారు. మద్య నిషేధం చేసి ఓటు అడుగుతానన్న హామీకి విరుద్ధంగా మద్యం ఆదాయాన్ని పొందుతున్నారు. మీ నాసిరకం మద్యం వల్ల 35 లక్షల మంది రోగాల బారిన పడ్డారు. అందులో 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మద్యంతో దోపిడీ చేస్తూ వారి ఆరోగ్యంతో చెలగాటం ఆడుతూ 'జగనన్న సురక్ష' అంటూ మళ్ళీ ప్రజల వద్దకు వెళ్తున్నారు. అమ్మఒడి పేరుతో ప్రభుత్వం వేస్తున్న డబ్బులకు, నాన్న బుడ్డికి లెక్కతో సరి చేస్తున్నారు. మద్యపాన నిషేధం చేయకపోగా మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. కల్తీ మద్యానికి ఇష్టానుసారంగా రేట్లు పెంచి దోపిడీ చేస్తున్న మీకు బుద్ధి చెప్పడానికి అదే పేదోడు సిద్దంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారూ’’ అని గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.

More Telugu News