India: సీనియర్ల బాటలోనే భారత జూనియర్లు కూడా... అండర్-19 వరల్డ్ కప్ ను ఆసీస్ కు అప్పగించేశారు!

  • దక్షిణాఫ్రికాలో అండర్-19 వరల్డ్ కప్
  • నేడు భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్
  • 79 పరుగుల తేడాతో ఓడిన భారత్
  • 254 పరుగుల లక్ష్యఛేదనలో 174 పరుగులకు ఆలౌట్ 
India lost to Aussies in Under 19 World Cup final

గతేడాది భారత్ గడ్డపై జరిగిన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియా గెలుచుకోవడం తెలిసిందే. ఆ మెగా టోర్నీలో ఫైనల్ వరకు అన్ని మ్యాచ్ లు గెలుస్తూ వచ్చిన టీమిండియా... ఆఖరి మెట్టుపై బోల్తాపడింది. ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు దక్షిణాఫ్రికాలో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ లోనూ అదే ఫలితం ఎదురైంది. 

నేడు బెనోనీలో జరిగిన ఫైనల్లో భారత్ కుర్రాళ్ల జట్టు 79 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. లక్ష్యం పెద్దదేమీ కానప్పటికీ, కుర్రాళ్లు ఒత్తిడికి లోనై వికెట్లు అప్పగించేశారు. 254 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ 43.5 ఓవర్లలో 174 పరుగులకే కుప్పకూలింది. 

ఆదర్శ్ సింగ్ 47, హైదరాబాద్ ఆటగాడు మురుగన్ అభిషేక్ 42, ముషీర్ ఖాన్ 22 పరుగులతో ఫర్వాలేదనిపించారు. టోర్నీలో పరుగుల వర్షం కురిపించిన కెప్టెన్ ఉదయ్ సహారన్ (8), సచిన్ దాస్ (9), అర్షిన్ కులకర్ణి (3) కీలకమైన ఫైనల్లో విఫలం కావడం జట్టు అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది. 

ప్రియాన్షు మోలియా 9 పరుగులు చేయగా, హైదరాబాద్ వికెట్ కీపర్ బ్యాటర్ ఆరవెల్లి అవనీశ్ రావు (0) డకౌట్ అయ్యాడు. ఆసీస్ బౌలర్లలో మాలీ బియర్డ్ మాన్ 3, రాఫ్ మెక్ మిలన్ 3, కల్లమ్ విల్డర్ 2, చార్లీ ఆండర్సన్ 1, టామ్ స్ట్రాకర్ 1 వికెట్ తీశారు. 

ఇప్పటికే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ చాంపియన్స్, టెస్ట్ చాంపియన్ షిప్ విజేత, మహిళల వన్డే, మహిళల టీ20 వరల్డ్ కప్ ల విజేతగా ఉన్న ఆస్ట్రేలియా ఖాతాలో ఇప్పుడు అండర్-19 వరల్డ్ కప్ కూడా చేరింది.

More Telugu News