Nara Lokesh: మీ మామ డైలాగ్ గుర్తొస్తోంది అని జేసీ అన్నారు: నారా లోకేశ్

  • శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో శంఖారావం సభ
  • హాజరైన నారా లోకేశ్
  • కేసులకు భయపడవద్దని టీడీపీ శ్రేణులకు పిలుపు
  • ఏ తప్పు చేయని చంద్రబాబును 53 రోజులు జైల్లో బంధించారని ఆగ్రహం
  • జేసీ ప్రభాకర్ రెడ్డిపై 100 కేసులు పెట్టారని వెల్లడి
Nara Lokesh reveals what JC said

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఏర్పాటు చేసిన శంఖారావం సభలో ప్రసంగించారు. ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తుంటే కేసులు పెడుతున్నారని, తనపైనా 22 కేసులు పెట్టారని వెల్లడించారు. అయినా తాము తగ్గేదే లేదు అని పుష్ప స్టయిల్లో స్పష్టం చేశారు. ఏ తప్పు చేయని చంద్రబాబునాయుడిని 53 రోజుల పాటు రాజమండ్రి జైల్లో బంధించారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

"ముందు రూ.3 వేల కోట్ల కుంభకోణం అన్నారు... తర్వాత రూ.230 కోట్ల కుంభకోణం అన్నారు... ఇప్పుడు రూ.27 కోట్ల కుంభకోణం అంటున్నారు. వైసీపీ వాళ్లకు సవాల్ విసురుతున్నా... ఆరోపణలపై చర్చకు నేను సిద్ధం... మరి మీ జగన్ సిద్ధమా? మేం ఏనాడూ తప్పు చేయలేదు... నీతి నిజాయతీకి మారుపేరు తెలుగుదేశం పార్టీ. అందుకే మేం ఎక్కడా తగ్గలేదు. 

ఒక అవినీతిపరుడైన నేత జైలుకు వెళితే రోజుకొక కుంభకోణం బయటపడుతుంది... కానీ చంద్రబాబు జైలుకు వెళితే ఆయన చేసిన మంచిపనులు బయటికి వచ్చాయి. దాదాపు 100 దేశాల్లో ఆయనకు అనుకూలంగా ధర్నాలు చేశారు. మన రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా చంద్రబాబుకు ప్రజలు సంఘీభావం తెలిపారు" అంటూ  లోకేశ్ ప్రసంగించారు. 

అంతేకాదు, రాష్ట్రంలో ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడవద్దని టీడీపీ శ్రేణులకు లోకేశ్ సూచించారు. తనపైనా కేసులు ఉన్నాయని, అయితే రాష్ట్రంలో తనతో కేసుల విషయంలో పోటీ పడుతోంది ఎవరో తెలుసా? అంటూ సభికులను ప్రశ్నించారు. వారు సమాధానం చెప్పలేకపోయేసరికి... జేసీ ప్రభాకర్ రెడ్డి అంటూ లోకేశ్ బదులిచ్చారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే... ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారని వెల్లడించారు. ఆయనపై కేసులు సెంచరీ దాటాయని వివరించారు. 

"ఓసారి జేసీని కలిసినప్పుడు ఏంటన్నా పరిస్థితి ఎలా ఉంది అని అడిగాను. అందుకాయన మీ మామ గారి డైలాగ్ గుర్తొస్తోంది అన్నారు. భయం అసలు మన బయోడేటాలోనే లేదు అని పలికారు. తెల్లకాగితం మీద సంతకం పెట్టి ఇచ్చాను... ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి అని చెప్పానన్నారు. ఇప్పటికే ఓసారి జైలుకు వెళ్లాను... మళ్లీ వెళ్లడానికి నాకేం భయంలేదు అని జేసీ చెప్పారు. మనం అందిపుచ్చుకోవాల్సిన స్పిరిట్ అదే. ఇక పోరాడదామా!" అంటూ లోకేశ్ పిలుపునిచ్చారు.

More Telugu News