Nara Lokesh: వీళ్ల ప్రేమకు కండిషన్లు ఉండవు: నారా లోకేశ్

  • ఉత్తరాంధ్రలో లోకేశ్ శంఖారావం యాత్ర
  • నేటి నుంచి ప్రారంభం
  • ఈ సాయంత్రం పలాసలో శంఖారావం సభ
  • ఉత్తరాంధ్ర అమ్మ వంటిదన్న లోకేశ్
  • ఉత్తరాంధ్రకు పట్టిన శని జగన్ అంటూ విమర్శల దాడి
Nara Lokesh attends Shankharavam meeting in Palasa

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఉత్తరాంధ్రలో నేడు శంఖారావం యాత్ర ప్రారంభించారు. తొలుత శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం సభలో పాల్గొన్న  లోకేశ్, ఈ సాయంత్రం పలాస సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర అమ్మ వంటిదని అభివర్ణించారు. అమ్మ ప్రేమకు కండిషన్లు ఎలా ఉండవో, ఉత్తరాంధ్ర ప్రజల ప్రేమకు కూడా కండిషన్లు ఉండవని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో ఉత్తరాంధ్రను జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దితే, ఈ వైసీపీ హయాంలో గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేశారని నారా లోకేశ్ విమర్శించారు. 

రామ్మోహన్ పార్లమెంటులో వైసీపీ నేతలను ఏకిపారేశాడు!

ఉత్తరాంధ్ర ఊపే వేరు... మన ఎంపీ రామ్మోహన్ నాయుడు పార్లమెంటులో వైసీపీ ఎంపీలను ఎలా కడిగిపారేస్తున్నాడో చూస్తున్నాం. పౌరుషాలకు, పోరాటాలకు గడ్డ శ్రీకాకుళం. గరిమెళ్ల సత్యనారాయణ, సర్దార్ గౌతు లచ్చన్న, కింజరాపు ఎర్రన్నాయుడు వంటి యోధులు ఈ పవిత్రమైన శ్రీకాకుళం గడ్డపైనే జన్మించారు. ఇంతటి పవిత్రమైన గడ్డపై నా శంఖారావం యాత్రను ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నాను. 

జగన్ దేనికి 'సిద్ధం' అంటున్నాడో నాకు అర్థమైంది

జగన్ ఇటీవల పదేపదే సిద్ధం అంటున్నాడు. అది చూసిన తర్వాత నాకో విషయం అర్థమైంది. జగన్ జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడు. మరి జగన్ ను జైలుకు పంపించేందుకు మీరు (ప్రజలు) కూడా సిద్ధంగా ఉన్నారా? బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ ను వైసీపీ నేతలు కిరాతకంగా చంపారు. ఇంకా ఎంతమంది బీసీ బిడ్డలను చంపాలనుకుంటున్నారు? 

దళిత మేధావి డాక్టర్ సుధాకర్ గారిని వేధించి, ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి తీసుకువచ్చారు. ఇంకా ఎంతమంది దళితులను ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు? మైనారిటీ బాలిక మిస్బా వంటి వారిని ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి తీసుకువచ్చింది ఈ ప్రభుత్వం. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు జగన్ సిద్ధం అంటున్నాడు. 

విశాఖలో వైసీపీ నేతల భూకబ్జాలకు సహకరించలేదని తహసీల్దార్ రమణయ్యను దారుణంగా కొట్టి చంపేశారు. బాపట్ల జిల్లా రైతు భరోసా కేంద్రం అగ్రికల్చర్ అసిస్టెంట్ పూజిత ఆత్మహత్య చేసుకుంది. అందుకు కారణం ఈ వైసీపీ నేతలు. విజయనగరం జిల్లా పంచాయతీరాజ్ జేఈ రామకృష్ణయ్య ఏకంగా ఫ్యాన్ కే ఉరేసుకుని బలవన్మరణం చెందాడు. ఆయన మృతికి కూడా వైసీపీ నేతలే కారణం. 

జగన్ ఈ మధ్య కొత్త నాటకం మొదలుపెట్టాడు

జగన్ ఇన్నాళ్లు నిద్రపోయి ఇప్పుడు డీఎస్సీ, డీఎస్సీ అంటూ కొత్త నాటకం మొదలుపెట్టాడు. ఎన్నికల ముందు ఏమన్నాడు... మెగా డీఎస్సీతో 23 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తానన్నాడు. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని మాట ఇచ్చి, ఇప్పుడు మాట తప్పి మడమ తిప్పాడు జగన్. అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో నెం.117 తీసుకువచ్చి టీచర్ ఉద్యోగాలు లేవంటున్నాడు. కేవలం 6 వేల టీచర్ పోస్టులతో డీఎస్సీ ప్రకటించాడు. 

ఇక్కడున్న యువతి ఒకటి గమనించాలి. నందమూరి తారకరామారావు, చంద్రబాబు ఇద్దరూ 1.70 లక్షల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశారు.

ఈ సభాముఖంగా యువతకు హామీ ఇస్తున్నా... రెండే రెండు నెలలు ఓపిక పట్టండి... మన ప్రభుత్వం వస్తుంది. ప్రతి సంవత్సరం మీకోసం డీఎస్సీ ప్రకటించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకున్నాను. 

ఇవన్నీ ఉన్న జగన్ పేదవాడా?

జగన్ పదేపదే తాను పేదవాడ్నని చెప్పుకుంటున్నాడు. సొంత టీవీ చానల్ ఉన్నవాడు పేదవాడు అవుతాడా? సొంత పేపర్ ఉన్నవాడు పేదవాడు అవుతాడా? సొంతంగా సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకున్నవాడు పేదవాడు అవుతాడా? సొంత సోలార్ ప్లాంట్లు ఉన్నవాడు పేదవాడు అవుతాడా? లక్ష రూపాయల ఖరీదు చేసే చెప్పులు వేసుకుని తిరుగుతాడు, రూ.1000 వాటర్ బాటిల్ లో నీళ్లు తాగేవాడు పేదవాడు అవుతాడా?

2019 ఎన్నికల ముందు అన్న విడిచిన బాణం అన్నారు

గత ఎన్నికల ముందు షర్మిలను అన్న విడిచిన బాణం అన్నారు. ఈ జగన్ సొంత చెల్లిని, తల్లిని కూడా మెడబట్టి బయటకు గెంటేశాడు. ఈ రోజు షర్మిల గానీ, సునీత గానీ తమకు భద్రత లేదని చెబుతున్నారు. సొంత కుటుంబంలోని ఆడవాళ్లకే భద్రత లేదంటే... రాష్ట్రంలోని ఆడవాళ్ల పరిస్థితేంటో అర్థమవుతోంది. 

ఉత్తరాంధ్రకు పట్టిన శని ఈ జగన్

జగన్ ఉత్తరాంధ్ర ప్రాంతానికి పట్టిన శని. మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడుతున్నాడు. విశాఖపట్నంలో కనీసం ఒక్క ఇటుక అయినా వేశాడా? ఈ ప్రాంతానికి ఒక్క పరిశ్రమ అయినా తీసుకువచ్చాడా? గత ప్రభుత్వ హయాంలో నేను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఐటీ కంపెనీకి భూములు కేటాయించాం. కనీసం ఆ కంపెనీతో పెట్టుబడులు కూడా పెట్టించలేకపోయాడు ఈ జగన్. ఇప్పుడు మన డబ్బు దోచేసి రూ.500 కోట్లతో విశాఖలో ఇంకో ప్యాలెస్ కట్టుకుంటున్నాడు. ఇది తప్ప మరెక్కడా అభివృద్ధి కనిపించడంలేదు. విశాఖ రైల్వే జోన్ కు భూమి కూడా కేటాయించలేకపోయారు.

కార్యకర్తలకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా

టీడీపీ కార్యకర్తలకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా. 2019 నుంచి ఇప్పటివరకు ఎవరు ఎక్కువ కేసులు పెట్టించుకుంటే వారికి అంత పెద్ద నామినేటెడ్ పదవి ఇస్తాం. కేసులకు భయపడవద్దు. అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడండి. నాపై కూడా చాలా కేసులు పెట్టారు... కానీ ఈ లోకేశ్ తగ్గేదే లేదు అని చెప్పాను.

More Telugu News