Donald Trump: ఎన్నికల ప్రచారంలో ట్రంప్, హేలీ మధ్య మాటల యుద్ధం

  • నిక్కీ హేలీ భర్త ఎక్కడంటూ ట్రంప్ ప్రశ్న.. తిప్పికొట్టిన నిక్కీ
  • సైనిక కుటుంబాల త్యాగం గురించి ట్రంప్ కు తెలియదంటూ ఫైర్
  • ఆఫ్రికాలో క్యాంప్ కు వెళ్లిన నిక్కీ భర్త మేజర్ మైఖెల్ హేలీ
Trump Mocks Nikki Haley Over Absence Of Her Husband

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్, నిక్కీ హేలీ తాజాగా మరోమారు విమర్శలు చేసుకున్నారు. నిక్కీ హేలీ భర్త ఎక్కడంటూ ట్రంప్ ప్రశ్నించగా.. సైనికుల త్యాగాలు ట్రంప్ కు తెలియవంటూ నిక్కీ తిప్పికొట్టారు. నిక్కీ భర్త మేజర్ మైఖేల్ హేలీ అమెరికా ఆర్మీలో సేవలందిస్తున్నారు. ఆర్మీ ఆయనను ఏడాది పాటు ఆఫ్రికాలోని క్యాంప్ కు పంపించింది. ఈ విషయం తెలియక ట్రంప్ నోరు జారడంతో నిక్కీ హేలీ విరుచుకుపడుతున్నారు. ఎన్నికల్లో పోటీకి సిద్దమయ్యే అభ్యర్థుల వయసు 75 ఏళ్లు దాటితే మానసిక పరీక్షలు చేయాలంటూ గతంలో తాను చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు మరొకసారి గుర్తుచేస్తున్నారు. మెంటల్ బ్యాలెన్స్ టెస్టుల్లో పాస్ అవుతానని ట్రంప్ అంటున్నారని, పాస్ అవుతారో ఫెయిలవుతారో.. ముందు పరీక్షలు చేయాలని నిక్కీ హేలీ డిమాండ్ చేస్తున్నారు.

రిపబ్లికన్ పార్టీకి చెందిన ట్రంప్, హేలీ ఇద్దరూ వచ్చే ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయాలని భావిస్తున్నారు. పార్టీ అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. ఈ రేసులో మాజీ అధ్యక్షుడు ట్రంప్ ముందున్నారు. వరుసగా మూడు కాకస్ లలో గెలుపొందారు. అయితే, చివరి వరకూ తాను ఓటమిని ఒప్పుకునేది లేదంటూ నిక్కీ హేలీ కూడా బరిలోనే ఉన్నారు. ఈ క్రమంలోనే సౌత్ కరోలినాలో ప్రచారం చేస్తూ నిక్కీ హేలీ భర్త ఎక్కడున్నాడు, ఎటో వెళ్లిపోయాడంటూ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన నిక్కీ హేలీ.. తన భర్త ఆర్మీకి సేవలందిస్తున్నారనే విషయం ట్రంప్ కు తెలియదని, సైనికుల త్యాగాల గురించి ట్రంప్ కు అస్సలు తెలియదని ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తి కమాండర్ ఇన్ చీఫ్ గా ఉండేందుకు అర్హుడు కాడని విమర్శించారు. ఈ సందర్భంగా ట్రంప్ కు ఆమె సవాల్ విసిరారు. ఏదైనా అనదల్చుకుంటే తన వెనకాల కాకుండా తన ముఖం మీదే అనాలని సూచించారు. ఓ డిబేట్ ఏర్పాటు చేస్తే రావడానికి సిద్ధమని ప్రకటించారు.

More Telugu News