Hungary: చిన్నారిపై లైంగికదాడి కేసులో నేరస్థుడికి క్షమాభిక్ష.. హంగరీ అధ్యక్షురాలి రాజీనామా

Hungary President Resigns Over Pardon To Man Convicted In Sex Abuse Case
  • బాలల సంరక్షణాలయంలో చిన్నారిపై ఉన్నతాధికారి లైంగిక దాడి
  • పైఅధికారి తప్పును కప్పిపుచ్చేందుకు సహకరించిన ఉద్యోగికి ఇటీవలే క్షమాభిక్ష
  • విషయం బయటకు పొక్కడంతో అగ్గిమీద గుగ్గిలమైన ప్రతిపక్షాలు
  • ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు పెల్లుబుకుతుండటంతో అధ్యక్షురాలి రాజీనామా
చిన్నారిపై లైంగిక దాడి జరిగిన కేసులో ఓ నిందితుడికి హంగరీ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించడం వివాదానికి దారి తీసింది. ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో శనివారం దేశ అధ్యక్షురాలు కటాలిన్ నోవాక్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రజలను నొప్పించాలన్నది తన ఉద్దేశం కాదని ఈ సందర్భంగా ప్రకటించారు. హంగరీ ప్రభుత్వాధికారం ప్రధాని చేతుల్లో ఉంటుంది. అధ్యక్షులకు నామమాత్రపు అధికారాలు ఉంటాయి. మార్చి 2022లో కటాలిన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఓ మహిళకు ఈ బాధ్యతలు దక్కడం చరిత్రలో ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే, ప్రధాని విక్టర్‌ ఆస్బార్న్‌కు ప్రధాన మద్దతుదారుగా ఉన్న కటాలిన్ రాజీనామా చేయడం పరిస్థితులను మరింత ఉద్రిక్తంగా మార్చింది. 

కొంతకాలం క్రితం ఓ బాలల సంరక్షణాలయ ప్రధాన అధికారి అక్కడి చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలు వెలువెత్తాయి. ఈ దారుణాన్ని కప్పిపుచ్చేందుకు అధికారికి సహకరించిన మరో ఉద్యోగికి అధ్యక్షురాలు ప్రభుత్వ సూచన మేరకు క్షమాభిక్ష ప్రసాదించారు. ఇటీవలే ఓ వెబ్‌సైట్ ఈ విషయాన్ని బయటపెట్టడంతో దేశంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రతిపక్షాలు ప్రధాని రాజీనామాకు పట్టుబట్టాయి. దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. శుక్రవారం నిరసనకారులు ప్రెసిడెంట్ నివాసం ముందు ధర్నాకు దిగారు. ప్రధానితో పాటూ అధికార పక్షం మొత్తం ఈ ఘటనకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. 

వరల్డ్ పోలో ఛాంపియన్‌షిప్స్‌లో భాగంగా హంగరీ మ్యాచ్‌ వీక్షించేందుకు ఖతర్‌లో ఉన్న అధ్యక్షురాలు, నిరసనల విషయం తెలియగానే హుటాహుటిన స్వదేశానికి చేరుకున్నారు. విమానం దిగిన వెంటనే తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తన నిర్ణయంతో బాధపడ్డ వారందికీ క్షమాపణలు చెబుతున్నానని వ్యాఖ్యానించారు. అయితే, ప్రధాని కూడా గద్దెదిగాలంటూ ప్రతిపక్షాలు నిరసనలు కొనసాగిస్తున్నాయి.
Hungary
President Resignation

More Telugu News