Ravichandran Ashwin: నేను అతడి వీరాభిమానిని.. సహచర ఆటగాడిపై ప్రశంసల జల్లు కురిపించిన స్పిన్నర్ అశ్విన్

  • వైజాగ్ టెస్టులో పేసర్ బుమ్రా అసలుసిసలైన ప్రదర్శన చేశాడంటూ పొగిడిన దిగ్గజ స్పిన్నర్
  • సెంచరీతో చెలరేగిన శుభ్‌మాన్ గిల్‌పైనా ప్రశంసలు
  • తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడిన రవిచంద్రన్ అశ్విన్
I am his big fan Spinner Ashwin showered praises on his fellow player Jasprit Bumrah

టీమిండియా స్టార్ పేసర్, వరల్డ్ నంబర్ 1 బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించాడు. వైజాగ్ టెస్టు మ్యాచ్‌లో గెలుపుపై స్పందిస్తూ.. అసాధారణ బౌలింగ్ చేశాడని, అసలుసిసలైన ప్రదర్శన చేసిన ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా అని ప్రశంసించాడు. అసలైన ఫెర్ఫార్మర్ బూమ్‌బాల్(బుమ్రా) అని, ప్రస్తుతం 14 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడని, టెస్ట్ బౌలర్‌లో నంబర్ 1 ర్యాంక్‌లో ఉన్నాడని పొగిడాడు. నంబర్ 1 ర్యాంకు సాధించడమంటే హిమాలయ శిఖరాన్ని తాకడమేనని, తాను బుమ్రా వీరాభిమానినని అశ్విన్ వ్యాఖ్యానించాడు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానెల్‌లో అశ్విన్ మాట్లాడాడు. కాగా జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం ప్రపంచ నంబర్ 1 టెస్ట్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌పై జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో రాణించడం ద్వారా తన స్థానాలను మెరుగుపరచుకున్నాడు. వైజాగ్ టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 45 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు.

ఇంగ్లండ్, ఇండియా టెస్టు సిరీస్‌లో బుమ్రా అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడని అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. ఇక వైజాగ్ టెస్టులో ఇంగ్లండ్‌కు 399 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంలో తన సెంచరీతో కీలక పాత్ర పోషించిన యువ బ్యాటర్ శుభ్‌మాన్ గిల్‌ను కూడా అశ్విన్ మెచ్చుకున్నాడు. అనుభవజ్ఞుడిలా ఆడాడని కొనియాడాడు. శుభ్‌మాన్ గిల్‌ ప్రతిభపై ఎలాంటి సందేహం లేదని, సెంచరీలు సాధించగల సమర్థవంతమైన ఆటగాడని పేర్కొన్నాడు. ఇదిలావుండగా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక మైలురాయికి చేరువలో ఉన్నాడు. మరో వికెట్ తీస్తే టెస్టులో 500 వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించనున్నాడు.

More Telugu News