Medaram: మేడారంలో షాపుల కూల్చివేత.. ధర్నాకు దిగిన స్థానికులు

  • వనదేవతల గద్దెలకు సమీపంలో రోడ్డుకు అడ్డంగా ఉన్నాయంటూ షాపుల కూల్చివేత
  • అడిషనల్ కలెక్టర్ ఆదేశాలపై షాపు యజమానుల నిరసన
  • పోలీసుల జోక్యంతో నిలిచిపోయిన షాపుల కూల్చివేత, శాంతించిన షాపు యజమానులు
Tensions in medaram after officials order demolition of shops

మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల సమీపంలో దారికి అడ్డంగా ఉన్నాయంటూ అధికారులు శుక్రవారం రాత్రి షాపులను కూల్చివేయించడం ఉద్రిక్తతలకు దారి తీసింది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా షాపులు ఎలా కూలుస్తారంటూ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అడిషనల్ కలెక్టర్ కారును అడ్డుకుని రాస్తారోకో నిర్వహించారు. 

ఈ నెల 21 నుంచి 24 వరకూ మేడారం మహాజాతర జరగనుంది. భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ములుగు అడిషనల్ కలెక్టర్ శ్రిజ ఆధ్వర్యంలో మేడారం గద్దెలకు దగ్గరగా ఉన్న ఏరియాలో రోడ్డుపై ట్రాఫిక్‌కు అడ్డుగా ఉన్న షాపులను తొలగించమని ఆదేశాలు జారీ చేశారు. 

ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి  జేసీబీలతో రెండు, మూడు షాపులను కూల్చేశారు. మిగతావాటిని కూల్చేందుకు మరుసటి రోజు ఉదయం అధికారులు రాగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. యజమానులు ధర్నాకు దిగారు. నోటీసులు ఇవ్వకుండా షాపులను కూల్చడమేంటని మండిపడ్డారు. గత వర్షాకాలంలో షాపులు కొట్టుకుపోవడంతో తీవ్రంగా నష్టపోయామని, ఇప్పుడు ట్రాఫిక్ జామ్ పేరిట దుకాణాలు తీసివేస్తే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. 

సర్కారు భూమిలో షెడ్లు ఎలా వేసుకుంటారని ప్రశ్నించిన అడిషనల్ కలెక్టర్.. భక్తుల సౌకర్యార్థమే ఇలా చేశామని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ, షాపు యజమానులు మాత్రం తమకు ప్రత్యామ్నాయ స్థలం చూపేవరకూ షాపులు కూల్చొద్దని పట్టుబట్టారు. ఈలోపు ఏటూరు నాగారం అడిషనల్ ఎస్పీ సంకీర్త్ జోక్యం చేసుకుని వ్యాపారులకు సర్ది చెప్పారు. మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో షెడ్ల కూల్చివేత నిలిచిపోవడంతో వ్యాపారులు నిరసన విరమించారు.

More Telugu News