KTR: కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్టు భావిస్తోంది: కేటీఆర్ వ్యంగ్యం

  • జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ కార్పొరేటర్లతో కేటీఆర్ సమావేశం
  • కాంగ్రెస్ అలవాటుగా బట్ట కాల్చి మీద వేస్తోందని విమర్శలు
  • మేడిగడ్డ గురించి కాంగ్రెస్ వాళ్లకు ఏం తెలిసి మాట్లాడుతున్నారని ఆగ్రహం
  • కాళేశ్వరం గురించి కాంగ్రెస్ వాళ్లకు ఓనమాలు కూడా తెలియని ఎద్దేవా
  • రాష్ట్రాన్ని ఓ క్రిమినల్ పాలిస్తున్నాడని వ్యాఖ్యలు 
KTR fires on Congress leaders

జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ కార్పొరేటర్లతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు తెలంగాణ భవన్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన అధికార కాంగ్రెస్ పై ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్టు భావించుకుంటోందని, అలవాటు ప్రకారం బట్ట కాల్చి మీద వేస్తోందని వ్యంగ్యం ప్రదర్శించారు. మేడిగడ్డ ప్రాజెక్టు గురించి తమకు సంపూర్ణ అవగాహన ఉందని, కానీ, కాంగ్రెస్ వాళ్లే అరకొర జ్ఞానంతో మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. మేడిగడ్డ కట్టిందే కేసీఆర్ అని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కాంగ్రెస్ నేతలకు ఓనమాలు కూడా తెలియవని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 

మేడిగడ్డ వద్ద ఏర్పడిన సమస్యను చూపించి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు అంతా విఫలమైందని ప్రచారం చేయడం సూర్యుడిపై ఉమ్మేసినట్టేనని అన్నారు. ప్రభుత్వానికి పూర్తి అధికార యంత్రాంగం ఉన్నప్పుడు ప్రాజెక్టులో ఏవైనా తేలికపాటి సమస్యలు వస్తే సరిచేయాలే కానీ, ఇలా కుటిల ప్రయత్నాలు చేయడం సరికాదని స్పష్టం చేశారు. 

తాము ఏ విచారణకైనా సిద్ధమేనని ఇంతకుముందూ చెప్పామని, ఇప్పుడూ అదే చెబుతున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతల మాటలు  వింటుంటే... బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నట్టు, కాంగ్రెస్ ఇంకా విపక్షంలో ఉన్నట్టుగా ఉందని వ్యంగ్యం ప్రదర్శించారు. 

ఇవాళ రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తి ఓ క్రిమినల్ అని, ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగ అని కేటీఆర్ విమర్శించారు. అలాంటి వ్యక్తికి క్రిమినల్ ఆలోచనలు తప్ప మరో ఆలోచనలు ఎలా వస్తాయని ప్రశ్నించారు.

More Telugu News