David Warner: ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు!

  • వెస్టిండీస్‌‌తో మ్యాచ్‌లో తన 100వ టీ20ని నమోదు చేసిన వార్నర్
  • ఇప్పటివరకూ కెరీర్‌లో 112 టెస్టులు, 161 వన్డేలు ఆడిన వైనం
  • 100కు పైగా మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా అరుదైన రికార్డు
David warner creates record for playing more than 100 in all three formats

ఆస్ట్రేలియా వెటరన్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. క్రికెట్‌లోని మూడు మ్యాచుల్లోనూ 100కు పైగా మ్యాచులు ఆడిన క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. ఇటీవలే వెస్టిండీస్‌తో వార్నర్ తన 100వ టీ20 మ్యాచ్‌ను ఆడాడు. తద్వారా ఆస్ట్రేలియా తరపున 100 టీ20 మ్యాచులు ఆడిన మూడో ఆటగాడిగా నిలిచిన వార్నర్.. ఇప్పటివరకూ 112 టెస్టులు, 161 వన్డేలు, 100 టీ20లు ఆడాడు. ఇక ఆరోన్ ఫించ్ 103 టీ20లతో అగ్రస్థానంలో నిలవగా ఆ తరువాత స్థానంలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ (101) ఉన్నాడు. వార్నర్ తరువాతి స్థానంలో మాథ్యూ వేడ్ (81 మ్యాచులు) ఉన్నాడు. 

వెస్టిండీస్‌తో జరుగుతున్న టోర్నీలోనూ వార్నర్ దుమ్ములేపుతున్నాడు. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో 37 ఏళ్ల వార్నర్ మెరుపు అర్ధసెంచరీతో (70, 36 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్) అదరగొట్టాడు. గతేడాది వన్డే వరల్డ్ కప్‌లో వార్నర్ ఆస్ట్రేలియాను విజయతీరాలకు చేర్చాడు. పాకిస్థాన్ టెస్టులోనూ చెలరేగి ఆడాడు. 

క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో 100, అంతకంటే ఎక్కువ మ్యాచులు ఆడిన జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. కోహ్లీ..113 టెస్టులు, 292 వన్డేలు, 117 టీ20లు ఆడాడు. ఇక న్యూజిలాండ్ మాజీ ఆటగాడు రాస్ టేలర్ తన కెరీర్‌లో 112 టెస్టులు, 236 వన్డేలు, 102 టీ20లు ఆడాడు. మరోవైపు, వార్నర్ తన కెరీర్‌కు ముగింపు పలికేందుకు రెడీ అయ్యాడు. జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ అని ఇప్పటికే ప్రకటించాడు. 

More Telugu News