Mt. Everest Poo-bags: పెంటకుప్పగా మారుతున్న ఎవరెస్ట్.. సమస్యకు చెక్ పెట్టేలా నేపాల్ కొత్త నిబంధనలు

Mount Everest climbers told to carry poo bags bring waste back to base camp
  • ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ నుంచి క్యాంప్-4 మధ్య మూడు టన్నుల మానవ వ్యర్థాలు
  • శీతల వాతావరణంతో విసర్జితాలన్నీ పోగుబడుతున్న వైనం
  • సమస్య పరిష్కారానికి నేపాల్ కొత్త నిబంధన, 
  • కాలకృత్యాల కోసం పర్వతారోహకులు మలం సంచులు వాడాలంటూ రూల్
  • ఈ సీజన్ నుంచే అమల్లోకి రానున్న కొత్త రూల్స్
ప్రకృతి అందాలతో తళుకులీనే ఎవరెస్ట్ పర్వతం.. నానాటికీ పేరుకుపోతున్న మానవ వ్యర్థాలతో పెంటకుప్పగా మారుతోంది. పర్వతారోహకుల మానవ విసర్జితాలు శీతలవాతావరణం కారణంగా అలాగే ఉండిపోతుండటంతో టన్నులకు టన్నులు చెత్త పేరుకుపోతోంది. ఈ పరిస్థితి నేపాల్‌కు తలనొప్పిగా మారడంతో పర్యావరణ పరిరక్షణ కోసం అక్కడి ప్రభుత్వం నడుం బిగించింది. సమస్య పరిష్కారానికి కొత్త నిబంధనలు రూపొందించింది. వీటి ప్రకారం, పర్యాటకులు ఇకపై కాలకృత్యాల కోసం మలం సంచీలను వాడాలి. పర్వతం దిగొచ్చేటప్పుడు పర్యాటకులు వాటిని వెంట తెచ్చుకోవాలి.

ఈ ఏడాది మేలో ప్రారంభమయ్యే పర్వతారోహణ సీజన్ నుంచే కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. పర్వతారోహకులు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్ద తప్పనిసరిగా మలం సంచులు కొనాలి. వీటిని నేపాల్ ప్రభుత్వం ప్రత్యేకంగా అమెరికా నుంచి కొనుగోలు చేస్తోంది. సంచుల్లోని రసాయన పదార్థాలు మానవ వ్యర్థాలను గట్టిపరిచి, దుర్వాసన కూడా తగ్గిస్తాయి. వీటిని పోర్టబుల్ డబ్బా టాయిలెట్స్‌గా పిలుస్తున్నారు. తాజాగా నేపాల్ ప్రభుత్వం మొత్తం 8 వేల సంచులను తెప్పించింది. అలాస్కాలోని మౌంట్ డెనాలీ పర్వతాల వద్ద వీటిని వినియోగిస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. 

పర్వతంపై దారుణ పరిస్థితులు..
ఎవరెస్ట్ బేస్ క్యాంప్ 1 నుంచి శిఖరంలోని క్యాంప్ 4 మధ్య సుమారు 3 టన్నుల మానవవ్యర్థాలు పోగుబడ్డాయని సాగరమాత కాలుష్య నియంత్రణ కమిటీ అంచనా వేస్తోంది. ఇందులో సగం వ్యర్థాలు క్యాంప్ 4 వద్దే ఉన్నాయట. ఈ నేపథ్యంలో సంచుల్లోనే కాలకృత్యాలు తీర్చుకోవాలని, ఆ సంచులను తిరిగి వెనక్కు తేవాలని నేపాల్ ప్రభుత్వం నిబంధనలు విధించింది. పర్యాటకులు ఈ నిబంధన పాటించారో లేదో కచ్చితంగా చెక్ చేస్తామని కూడా పేర్కొంది. 

పర్వత పర్యాటకంపై నేపాల్ ప్రభుత్వం మంచి ఆదాయాన్ని ఆర్జిస్తోంది. గతేడాది మే నాటికి ప్రభుత్వం రూ.48 కోట్లు ఆర్జించగా, అందులో రూ.41 కోట్లు ఒక్క ఎవరెస్ట్ పర్వత పర్యాటకం ద్వారానే చేకూరాయి. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 14 పర్వతాల్లో 8 హిమవత్ పర్వత శ్రేణుల్లోనే ఉన్నాయి.  
Mt. Everest Poo-bags
Nepal
Himalayas

More Telugu News