iPhones: పట్టపగలు.. అందరూ చూస్తుండగా 40 ఐఫోన్లు కొట్టేసిన దొంగ.. వీడియో వైరల్ ఇదిగో

Man robs 40 iPhones worth Rs 40 lakh from Apple store in daylight in USA
  • ప్రేక్షక పాత్ర పోషించిన యాపిల్ స్టోర్ సిబ్బంది, ఇతర కస్టమర్లు
  • దొంగను పట్టుకున్నామని ప్రకటించిన పోలీసులు
  • అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో షాకింగ్ ఘటన
అగ్రరాజ్యం అమెరికాలో ఓ దొంగ రెచ్చిపోయాడు. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఓ యాపిల్ స్టోర్‌లో ఏకంగా 40 ఐఫోన్లను కొట్టేశాడు. వాటి విలువ సుమారు రూ.40 లక్షల వరకు ఉంటుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ముఖాన్ని వస్త్రంతో కప్పుకొని దొంగ ఈ చర్యకు పాల్పడ్డాడు. అక్కడే ఉన్న స్టోర్ సిబ్బంది, పలువురు కస్టమర్లు ప్రేక్షకపాత్ర పోషించారు. స్టోర్‌లోని మూడు డిస్‌ప్లే టేబుళ్లపై ఉన్న ఐఫోన్‌లను దొంగ తీస్తుండగా అందరూ చూస్తుండిపోవడం వీడియోలో కనిపించింది. ఫోన్లు తీసుకొని దొంగ పారిపోయాడు. దొంగతనం జరిగిన ప్రదేశానికి సమీపంలోనే ఒక పోలీసు వాహనం కూడా ఉంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి టిక్‌టాక్‌లో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. శాన్‌ఫ్రాన్సిస్కోలో గత సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. 

అయితే సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. టైలర్ మిమ్స్ అనే 22 ఏళ్ల యువకుడు ఈ దొంగతానికి పాల్పడ్డాడని పోలీసులు గుర్తించారు. అతడిపై ఇప్పటికే పలు దొంగతనం కేసులు ఉన్నాయని చెప్పారు. అతడిని అదుపులోకి తీసుకున్నామని, శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టనున్నామని పోలీసులు వివరించారు. కాగా నిందితుడు మిమ్స్‌తో పాటు మరో ఇద్దరు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. కాగా దొంగ మిమ్స్ పరిగెత్తిన వీధిలో ఓ పోలీసు వాహనం కనిపించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ సమయంలో వాహనంలో పోలీసులు ఎవరూ లేదని అధికారులు వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లా అండ్ ఆర్డర్ అమల్లో ఉందా? లేదా? అని రాజకీయ నాయకులు ప్రశ్నిస్తున్నారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. దొంగతనానికి సంబంధించిన వీడియోను ఎక్స్‌లో షేర్ చేసి ‘దీనిపై మీ అభిప్రాయం ఏంటి’ అని ట్రంప్ ప్రశ్నించారు.
iPhones
Apple store
USA
rob

More Telugu News