TSRTC: హైదరాబాద్ సిటీ బస్సుల్లో తిరిగి వస్తున్న ఆ ఐదు వేల సీట్లు!

  • మహిళల సీట్లవైపు పురుషులు రాకుండా బస్సుల్లో గ్రిల్స్ ఏర్పాటు
  • ఇందుకోసం ఒక్కో బస్సులో నాలుగు సీట్ల తొలగింపు
  • మళ్లీ వాటిని అమర్చుతున్న అధికారులు
  • జిల్లాల్లో తిరిగే డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులకు మారుతున్న రూపురేఖలు
TSRTC Replace 5 Thousand Seats That Removed Earlier

హైదరాబాద్ సిటీ బస్సుల్లో గతంలో పోయిన సీట్లు తిరిగి వస్తున్నాయి. ఫలితంగా సీట్లు పెరగడంతో ప్రయాణికుల వెతలు తీరబోతున్నాయి. సిటీ బస్సుల్లో ప్రయాణించే పురుషులు.. మహిళల సీట్లవైపు చొచ్చుకు రాకుండా గతంలో గ్రిల్స్ వంటివి ఏర్పాటు చేశారు. ఇందుకోసం 1300 బస్సుల్లో ఒక్కోదాంట్లో నాలుగేసి సీట్ల చొప్పున తొలగించారు.  ఈ లెక్కన దాదాపు 5 వేలకుపైగా సీట్లు తగ్గిపోయాయి.

మహాలక్ష్మి పథకంలో భాగంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం తీసుకొచ్చింది. దీంతో తొలగించిన ఈ సీట్లను తిరిగి అమర్చడం ద్వారా మరింతమంది సౌకర్యంగా ప్రయాణించే వీలు కల్పించాలని నిర్ణయించింది. పాతబస్సులను తుక్కుగా మార్చుతున్న అధికారులు జిల్లాల్లో తిరిగే డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులను నగరానికి తీసుకొచ్చి రూపురేఖలు మార్చుతున్నారు. అడ్డుతెరలు లేకుండా ప్రతి బస్సులో 45 సీట్లు ఉండేలా చూస్తున్నారు. అలా ఇప్పటి వరకు 800 బస్సుల్లో 3,200 సీట్లు అధికంగా అందుబాటులోకి వచ్చాయి.

ఇక, ఉచిత ప్రయాణంతో బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య అమాంతం పెరిగింది. నగరంలో ఒకరోజులో ప్రయాణించే మహిళల సంఖ్య 11 లక్షల నుంచి 19 లక్షలకు పెరిగింది. సోమవారం ఏకంగా 21.50 లక్షల మంది ప్రయాణించినట్టు అధికారులు తెలిపారు.  మిగతా రోజుల్లో 19 లక్షల వరకు ప్రయాణిస్తున్నట్టు పేర్కొన్నారు. మరో నాలుగైదు నెలల్లో 500 ఎలక్ట్రిక్ బస్సులు రావడంతోపాటు, 500 ఆర్డినరీ బస్సులను కూడా ఆర్టీసీ సమకూర్చుకోనుంది.

More Telugu News