Pakistan: ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠ... పాకిస్థాన్‌లో సంకీర్ణం ప్రభుత్వం!

Pakistan ex PMs and rivals Nawaz Sharif and Imran Khan both claim win in chaotic polls

  • మెజారిటీ తమదేనని ప్రకటించుకున్న మాజీ ప్రధానులు ఇమ్రాన్ ఖాన్, నవాజ్ షరీఫ్‌ పార్టీలు
  • ఇప్పటివరకు ఇమ్రాన్ పార్టీ మద్దతున్న స్వతంత్రులు 99, నవాజ్ పార్టీ పీఎంఎల్-ఎన్ 71 సీట్లలో గెలుపు
  • సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కోసం చర్చలు జరుపుతున్న నవాజ్ షరీఫ్‌ 

దాయాది పాకిస్థాన్‌లో జాతీయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో హింసాత్మక ఘటనల మధ్య శుక్రవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిగింది. ఇప్పటివరకు 250 స్థానాలకు పాకిస్థాన్ ఎన్నికల సంఘం ఫలితాలు ప్రకటించింది. అత్యధికంగా ఇమ్రాన్ ఖాన్ స్థాపించిన పీటీఐ పార్టీ మద్దతున్న స్వతంత్రులు అత్యధికంగా 99 సీట్లు గెలుచుకున్నారు. ఇక నవాజ్ షరీఫ్ సారధ్యంలోని పీఎంఎల్-ఎన్ 71 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. పీపీపీ 53 సీట్లు, ఇతరులు 27 స్థానాలు గెలుచుకున్నారు. పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లు ఉన్నాయి. అందులో 266 మంది ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నికవుతారు. ప్రభుత్వం ఏర్పాటుకు 169 సీట్లు అవసరమవ్వగా ప్రస్తుతం ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి. ఈ మేరకు అక్కడి పార్టీలు పావులు కదుపుతున్నాయి.

మాజీ ప్రధాని, పీఎంఎల్-ఎన్ నాయకుడు నవాజ్ షరీఫ్ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పీపీపీకి ఆసిఫ్ అలీ జర్దారీ, జేయుఐ-ఎఫ్‌ పార్టీకి చెందిన ఫజ్లుర్ రెహ్మాన్, ఎంక్యూఎం-పీ పార్టీకి చెందిన ఖలీద్ మక్బూల్ సిద్ధిఖీలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ మేరకు తన తమ్ముడు షెహబాజ్‌ను ఆయన రంగంలోకి దించారు. ఇక స్వతంత్ర అభ్యర్థులతోపాటు అన్ని పార్టీలను గౌరవిస్తామని అన్నారు. తమతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నామని శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఎన్నికలలో పీఎంఎల్-ఎన్ అతిపెద్ద పార్టీగా అవతరించిందని ప్రకటించుకున్నారు. మళ్లీ మళ్లీ ఎన్నికలు నిర్వహించలేమని, పాకిస్థాన్‌ను సంక్షోభం నుంచి బయటపడేసేందుకు ప్రతి ఒక్కరూ సానుకూల పాత్ర పోషించాలని నవాజ్ షరీఫ్ కోరారు. 

తమ పార్టీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ లేదని, ఇతర పార్టీలను కలిసి రావాలని నవాజ్ షరీఫ్ విజ్ఞప్తి చేశారు. పొరుగు దేశాలతో శాంతియుత సంబంధాలను పెంపొందించుకొని ముందుకు వెళ్దామంటూ ఇతర పార్టీలను నవాజ్ షరీఫ్ కోరారు. భారత్ సహా పొరుగు దేశాలతో శాంతియుత సంబంధాలను కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

కాగా పీటీఐ పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ కూడా కీలకమైన ప్రకటన విడుదల చేశారు. పాకిస్థాన్ ఎన్నికల్లో తమకే మెజారిటీ దక్కిందని అన్నారు. నవాజ్ షరీఫ్ ఒక తెలివితక్కువ రాజకీయ నాయకుడని వ్యాఖ్యానించారు. అయితే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఆయన కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.

Pakistan
Pakistan Poll
Nawaz Sharif
Imran Khan
  • Loading...

More Telugu News