Dalit Woman Stripped: కామారెడ్డి జిల్లాలో అమానవీయం.. దళిత మహిళను వివస్త్రను చేసి.. కళ్లలో కారంకొట్టి.. స్తంభానికి కట్టేసి దాడి!

  • దళిత మహిళతో సహజీవనం చేసి ఆపై పెళ్లి చేసుకుని కాపురం
  • భార్య పంచాయితీ పెట్టి హెచ్చరించినప్పటికీ పద్ధతి మార్చుకోని భర్త
  • బంధువులతో కలిసి వారింటికి వెళ్లి ఇద్దరినీ నగ్నంగా మార్చి దాడి
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోలు, వీడియో
  • సీరియస్‌గా స్పందించిన కామారెడ్డి ఎస్పీ.. విచారణకు ఆదేశం 
Dalit Woman Stripped And Attacked In Kamareddy Telangana

సాధారణంగా ఇలాంటి ఘటనలు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్ వంటి రాష్ట్రాల్లో జరుగుతున్నట్టుగా వార్తలు చదువుతూ ఉంటాం. కానీ, అంతకు ఏమాత్రం తీసిపోని ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో జరిగింది. దళిత మహిళతో సహజీవనం చేసి వివాహం చేసుకున్న వ్యక్తిని పట్టుకుని నగ్నంగా మార్చి కళ్లలో కారం కొట్టి విద్యుత్ స్తంభానికి కట్టేసి చావబాదారు. అక్కడితో ఆగకుండా ఈ మొత్తం ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అది కాస్తా వైరల్ అయింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అక్కాపూర్ గ్రామానికి చెందిన నందాని నరేశ్ ముదిరాజ్ వ్యవసాయ కూలీ. మూడేళ్ల క్రితం గ్రామానికే చెందిన సంధ్యను వివాహం చేసుకున్నాడు. వీరికి ఏడాది వయసున్న కుమార్తె ఉంది. ఇదిలావుంచితే, నరేశ్‌కు సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన దళిత యువతితో పరిచయం ఏర్పడింది. మతిస్థిమితం సరిగా లేక భర్త నుంచి ఆమె దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో నరేశ్‌కు ఆమెతో వివాహేతర సంబంధం ఏర్పడింది.

ఈ విషయం నరేశ్ భార్య సంధ్యకు తెలియడంతో ఆమె పంచాయితీ పెద్దల దృష్టికి తీసుకెళ్లింది. వారు హెచ్చరించినప్పటికీ పద్ధతి మార్చుకోని నరేశ్ ఇటీవల ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఇసన్నపల్లిలో ఆమెతో కాపురం పెట్టాడు. విషయం తెలిసిన సంధ్య, ఆమె కుటుంబ సభ్యులు ఈ నెల 4న గ్రామంలోని ఆమె ఇంటికి వెళ్లి ఇద్దరినీ పట్టుకుని నగ్నంగా మార్చి కళ్లలో కారం కొట్టి దాడిచేశారు. ఆ తర్వాత ఇద్దరినీ అక్కాపూర్ తీసుకొచ్చి విద్యుత్ స్తంభానికి కట్టేసి చావబాదుతూ హింసించారు. 

ఈ మొత్తం ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరినీ విడిపించినప్పటికీ కేసు నమోదు చేసేందుకు నిరాకరించారు. ఘటన జరిగిన రామారెడ్డి మండలంలోనే ఫిర్యాదు చేయాలని సూచించినట్టు తెలిసింది. బాధిత మహిళ ఫిర్యాదుతో రామారెడ్డిలో నలుగురిపై కేసు నమోదైంది.

ఈ ఘటనను కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధూశర్మ తీవ్రంగా పరిగణించారు. విచారణ చేపట్టాలని ఆదేశించారు. దాడికి పాల్పడిన నరేశ్ భార్య సంధ్య, మరో ముగ్గురిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మాచారెడ్డిలో దళిత సంఘాల ఆధ్వర్యంలో నిన్న ఆందోళనకు దిగారు.

More Telugu News