Pre Wedding Shoot: ఆపరేషన్ థియేటర్‌లో ప్రీవెడ్డింగ్ షూట్.. వైద్యుడిని సస్పెండ్ చేసిన ప్రభుత్వం

  • కర్ణాటకలోని చిత్రదుర్గలో ఘటన
  • కాబోయే భార్యతో కలిసి రోగికి ఆపరేషన్ చేస్తున్నట్టు ప్రీ వెడ్డింగ్ షూట్
  • వీడియో వైరల్ కావడంతో వైద్య వర్గాల్లో చర్చ
  • వైద్యుడిని సస్పెండ్ చేసిన మంత్రి దినేశ్ గుండూరావ్
Karnataka Doctor Suspended For Wedding Shoot In Operation Theatre

పిచ్చి ముదిరి పాకాన పడడం అంటే ఇదేనేమో. ఓ యువ వైద్యుడు తన ప్రీవెడ్డింగ్ షూట్‌ను ఏకంగా ఆపరేషన్ గదిలో షూట్ చేయించుకున్నాడు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాకెక్కి వైరల్‌గా మారడంతో ప్రభుత్వం అతడిని విధుల నుంచి సస్పెండ్ చేసింది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో జరిగిన ఈ ఘటన ప్రీవెడ్డింగ్ షూట్ పేరుతో ఇటీవల పెరిగిన వికృత చేష్టలకు అద్దంపడుతోంది.

భరంసాగర్ ప్రాంతంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ వైద్యుడిగా పనిచేస్తున్న అతడు కాబోయే భార్యతో కలిసి ఓ వ్యక్తికి ఆపరేషన్ చేస్తున్నట్టుగా ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలకు ఎక్కడంతో వైద్య వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. విషయం కాస్తా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దినేశ్ గుండూరావ్ దృష్టికి వెళ్లడంతో ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రీవెడ్డింగ్ షూట్‌కు ఆపరేషన్ థియేటర్‌ను వేదికగా చేసుకున్న వైద్యుడిని విధుల నుంచి డిస్మిస్ చేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు, తక్షణం ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఎక్స్ ద్వారా ప్రకటించారు.

ఆసుపత్రులు ఉన్నది ప్రజలకు వైద్యం అందించేందుకే కానీ ఇలా ప్రీ వెడ్డింగ్ షూట్‌లకు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. సామాన్యుల కోసమే ప్రభుత్వం వైద్య సదుపాయాలు కల్పిస్తోందని, దానిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు విధి నిర్వహణపై దృష్టిసారించాలని మంత్రి సూచించారు.

ఈ ఘటనపై చిత్రదుర్గ జిల్లా ఆరోగ్యాధికారి రేణుప్రసాద్ మాట్లాడుతూ.. వైద్యుడిని నెల రోజుల క్రితమే నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా అపాయింట్ చేసుకున్నట్టు చెప్పారు. అతడు ప్రీవెడ్డింగ్ షూట్ చేసుకున్న ఆపరేషన్ థియేటర్‌ను మరమ్మతుల కారణంగా సెప్టెంబర్ నుంచి ఉపయోగించడం లేదని వివరణ ఇచ్చారు.

More Telugu News