Nara Bhuvaneswari: బాధిత కుటుంబాలను ఆదుకోవడం మా బాధ్యత: నారా భువనేశ్వరి

  • నందిగామలో భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ పర్యటన
  • చంద్రబాబు అరెస్ట్  అనంతరం మరణించిన కార్యకర్త కుటుంబానికి పరామర్శ
  • రూ.3 లక్షల ఆర్థికసాయం అందజేత
  • కార్యకర్తలకు ఎప్పటికీ రుణపడి ఉంటామని వెల్లడి 
Nara Bhuvaneswari said they indebted to TDP workers forever

వచ్చే ఎన్నికల కురుక్షేత్రంలో తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో గెలుస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరి ధీమా వ్యక్తం చేశారు. నిజం గెలవాలి పర్యటనలో భాగంగా ఆమె నేడు ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో పర్యటించారు. 

చంద్రబాబు అరెస్టు అనంతరం చందర్లపాడు మండలం కోనాయపాలెంలో టీడీపీ కార్యకర్త వనపర్తి మల్లికార్జునరావు మృతి చెందారు. ఇవాళ్టి పర్యటనలో మల్లికార్జునరావు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. 

అనంతరం భువనేశ్వరి మాట్లాడుతూ... టీడీపీని గెలిపించేందుకు రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు పన్నినా టీడీపీ గెలుపును అడ్డుకోలేరని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి పన్నిన కుట్రల్లో భాగంగానే చంద్రబాబుపై కేసులు పెట్టి జైలుకు పంపారని ఆరోపించారు. 

చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేక పలువురు కార్యకర్తలు మృతిచెందడం బాధాకరమన్నారు. చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించడంతో పాటు ఆదుకోవాలని జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు తనతో చెప్పారని భువనేశ్వరి వెల్లడించారు. 

బిడ్డల్లాంటి కార్యకర్తలను ఆదుకోవడం తన కర్తవ్యమన్నారు. ఇందులో భాగంగానే, చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను నేరుగా పరామర్శించి ఆర్థికంగా ఆదుకుంటున్నానని వివరించారు. ఇప్పటిదాకా 90 కుటుంబాలను పరామర్శించానని తెలిపారు. 

చంద్రబాబు ప్రజల మనిషి అని, ఆయన ధ్యాస అంతా ప్రజలు, కార్యకర్తల గురించేనని అన్నారు. నిరంతరం కార్యకర్తల గురించి పరితపిస్తుంటారని, చంద్రబాబును కార్యకర్తల నుండి ఏ శక్తీ వేరుచేయలేదన్నారు. 

తమ కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలు అండగా నిలబడి చూపిన అభిమానం ఎప్పుడూ మరువలేనిదన్నారు. తమ కుటుంబం కోసం నిలబడిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటామని భువనేశ్వరి అన్నారు.

More Telugu News