Revanth Reddy: ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం... రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు

Supreme Court notices to Revanth Reddy
  • 2015 నాటి ఓటుకు నోటు కేసు వ్యవహారం
  • రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నందున కేసును మరో రాష్ట్రానికి తరలించాలని బీఆర్ఎస్ నేతల పిటిషన్
  • రేవంత్ రెడ్డికి, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు
ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు పదేళ్ల క్రితం ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు శుక్రవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసును మధ్యప్రదేశ్ లేదా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి తరలించాలని బీఆర్ఎస్ నాయకులు జగదీశ్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, సత్యవతి రాథోడ్, మహమ్మద్ అలీలు గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నందున కేసును ప్రభావితం చేస్తారని... దర్యాఫ్తు పారదర్శకంగా జరగదనే అనుమానాలను వారు పిటిషన్‌లో వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య బెంచ్... రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. నోటీసులపై నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది.

రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్న సమయంలో... 2015లో ఈ కేసు నమోదయింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్‌ను రేవంత్ రెడ్డి కలిసి డబ్బులు ఇస్తున్న వీడియోలు వైరల్‌గా మారాయి. దీంతో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మరోసారి ఈ కేసు తెరపైకి వచ్చింది.
Revanth Reddy
Congress
Telangana
Supreme Court

More Telugu News