Bonda Uma: జాతీయ మీడియాలో వచ్చిన సర్వే దెబ్బకు వైసీపీ దుకాణం బంద్: బొండా ఉమ

  • నిన్న ఇండియా టుడే-సీ ఓటర్ సర్వే వివరాల వెల్లడి
  • ఏపీలో టీడీపీకి 17, వైసీపీకి 8 లోక్ సభ స్థానాలు
  • తాడేపల్లిలో పునాదులు కదులుతున్నాయన్న బొండా ఉమ
  • సజ్జల వంటి సలహాదారులు జీర్ణించుకోలేకపోతున్నారని వ్యంగ్యం
Bonda Uma said YCP closed after national media survey

ఇండియాటుడే-సీ ఓటర్ 'మూడ్ ఆఫ్ ద నేషన్' సర్వేలో టీడీపీకి 17 లోక్ సభ స్థానాలు, వైసీపీకి 8 లోక్ సభ స్థానాలు వస్తాయని పేర్కొనడం తెలిసిందే. దీనిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమ స్పందించారు. 

జాతీయ మీడియాలో వచ్చిన సర్వేతో వైసీపీ దుకాణం బంద్ అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు, అమిత్ షా భేటీతో వైసీపీ వర్గాల్లో వణుకు పుడుతోందని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో 60 శాతం ఓటు బ్యాంకుతో టీడీపీ-జనసేన కూటమి క్లీన్ స్వీప్ చేయబోతోందని బొండా ఉమ స్పష్టం చేశారు. 

జగన్ దెబ్బకు అసెంబ్లీ నుంచి మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు పారిపోతున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు. జాతీయ సర్వే దెబ్బకు తాడేపల్లిలో పునాదులు కదులుతున్నాయని అన్నారు. అసెంబ్లీలో చివరి సమావేశాలు అని పెడితే కనీసం 20 మంది ఎమ్మెల్యేలు కూడా లేరని, 26 మంది మంత్రుల్లో ముగ్గురో, నలుగురో కనిపించారని బొండా ఉమ వెల్లడించారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన పిట్టకథల మంత్రి, మరో ఇద్దరు... వీళ్లు తప్పితే ఇతర మంత్రులెవరూ అసెంబ్లీ దారిదాపుల్లో కనిపించలేదని తెలిపారు. 

"దీన్ని బట్టి... జగన్ మోహన్ రెడ్డి ముఖం చూడడం ఇష్టంలేకనే వైసీపీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ రాలేదని అర్థమవుతోంది. ఇక నీ పని అయిపోయింది జగన్ మోహన్ రెడ్డీ అని సొంత పార్టీ వాళ్లే చెబుతున్నారు. మేం కాదు... జాతీయ స్థాయిలో సర్వేలు  చెబుతున్నాయి, ప్రజలు చెబుతున్నారు. 

నిన్న 'మూడ్ ఆఫ్ ద నేషన్' సర్వే వివరాలు వెల్లడించిన ఇండియా టుడే-సీ ఓటర్ వాళ్లు, 2019లోనూ సర్వే చేపట్టి ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. కానీ ఇవాళ సాక్షి పత్రికలో ఏమని వేసుకున్నారో చూడండి... సీ ఓటర్ సర్వే నేతి బీర సర్వే అని రాశారు. వైసీపీ గెలుస్తుందని చెబితేనేమో వాళ్లు సూపర్... లేకపోతేనేమో పాపర్...! 

రూ.140 కోట్లు మేసిన సజ్జల వంటి సలహాదారులందరూ వైసీపీ అధికారం కోల్పోతుందంటే నమ్మలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు" అంటూ బొండా ఉమ విమర్శనాస్త్రాలు సంధించారు.

More Telugu News