Harish Rao: బీఏసీ సమావేశానికి హరీశ్ రావడంపై శ్రీధర్ బాబు అభ్యంతరం.. బయటకు వచ్చేసిన హరీశ్

  • కేసీఆర్ స్థానంలో బీఏసీకి వచ్చిన హరీశ్
  • బీఏసీ మెంబర్ కాదంటూ శ్రీధర్ బాబు అభ్యంతరం
  • ఈ నెల 14 వరకు జరగనున్న బడ్జెట్ సమావేశాలు
Harish Rao came out of BAC meeting

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. అనంతరం బీఏసీ సమావేశం జరిగింది. అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సమావేశాల పనిదినాలు, ఎజెండాను ఖరారు చేశారు. 

మరోవైపు బీఏసీ సమావేశం సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సమావేశానికి కేసీఆర్ కు బదులుగా హరీశ్ రావు వచ్చారు. తన బదులుగా హరీశ్ వస్తాడని కేసీఆర్ ముందుగానే సమాచారం ఇచ్చారు. అయినప్పటికీ హరీశ్ రావడంపై మంత్రి శ్రీధర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఏసీలో మెంబర్ కాకుండా హాజరుకావడంపై అభ్యంతరాన్ని తెలియజేశారు. స్పీకర్ అనుమతితో కేసీఆర్ స్థానంలో తాను హాజరయ్యానని హరీశ్ చెప్పినప్పటికీ... అలా కుదరదని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. దీంతో చేసేదేమీ లేక... కాసేపటి తర్వాత సమావేశం మధ్యలో ఆయన బీఏసీ నుంచి బయటకు వచ్చారు. 

బీఏసీ సమావేశానికి కాంగ్రెస్ తరపున సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు. బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ హాజరయ్యారు. 

మరోవైపు ఈ నెల 13 వరకు బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. 10వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రేపు గవర్నర్ ప్రసంగంపై చర్చ జరగనుంది.

More Telugu News