K Kavitha: అంతవరకైతే క్షమించవచ్చేమో కానీ.. ఇదేంటి రేవంత్‌రెడ్డి గారూ?: కవిత నిలదీత

  • సింగరేణి జాబ్‌మేళాలో 441 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించిన రేవంత్‌రెడ్డి
  • కేసీఆర్ హయాంలో 20 వేలమందికి నియామకాలు ఇచ్చినా కేసీఆర్ ఎప్పుడూ స్వయంగా అందించలేదన్న కవిత
  • గొప్పలు చెప్పుకోవడం ఆపాలని హితవు
MLC Kavitha Slams Revanth Reddy Over Singareni Jobs

సచివాలయంలోని అంబేద్కర్ మెమోరియల్ సెంటర్ వద్ద నిన్న ఏర్పాటు చేసిన సింగరేణి జాబ్‌మేళాలో 441 మందికి సీఎం రేవంత్‌రెడ్డి కారుణ్య నియామక పత్రాలు అందించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా స్పందించారు. నిజానికి ఇది చాలా సిగ్గుచేటైన విషయమని, డిపెండెంట్ ఉద్యోగాలు పోగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, తెలుగుదేశం పార్టీ ట్రేడ్ యూనియన్, జాతీయ, రాష్ట్ర ట్రేడ్ యూనియన్లు అన్నీ కలిపి సంతకాలు చేసి డిపెండెంట్ ఉద్యోగాలు ఊడగొట్టాయని కవిత ఆరోపించారు.

కేసీఆర్ హయాంలో 20 వేల నియామకాలు ఇచ్చినట్టు కవిత తెలిపారు. ఆ సమయంలో కేసీఆర్ వెళ్లి ఒక్క నియామకపత్రం కూడా ఇవ్వలేదని, సింగరేణి సంస్థలో నిత్యం జరిగే వ్యవహారంగానే దానిని భావించారని పేర్కొన్నారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం వారిని హైదరాబాద్‌కు పిలిపించి సీఎం స్థాయిలో నియామక పత్రాలు అందించారని విమర్శించారు. అక్కడితో ఆగకుండా తాము సింగరేణిలో 400 ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని, అక్కడి వరకు క్షమించవచ్చని అన్నారు. అధికారంలోకి వచ్చాక అయినా నిజాలు చెప్పాలని రేవంత్‌రెడ్డికి సూచించారు.

More Telugu News