YS Sharmila: హోదా రాలేదు కానీ ‘స్పెషల్ స్టేటస్’ జగన్ పుణ్యమే.. బాపట్లలో నిప్పులు కురిపించిన వైఎస్ షర్మిల.. వీడియో ఇదిగో!

  • వైఎస్ పాలనకు, జగన్ పాలనకు భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉందన్న షర్మిల
  • మేనిఫెస్టో తనకు బైబిల్, ఖురాన్, భగవద్గీత అన్న జగన్ మడమ తిప్పేశారని విమర్శ
  • మద్యం ఎక్కడా లేకుండా చేస్తానన్న జగన్ ప్రత్యేక బ్రాండ్లు తెచ్చారని ఆగ్రహం
YS Sharmila Sister Of AP CM Slams YS Jagan

ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఘాటు విమర్శలతో అందరి దృష్టిని ఆకర్షించిన షర్మిల అదే జోరు కొనసాగిస్తున్నారు. అవకాశం దొరికిన ప్రతిసారీ నిప్పులు చెరుగుతున్నారు. ఏపీలో కునారిల్లిన కాంగ్రెస్‌కు జవసత్వాలు తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్న షర్మిల ప్రస్తుతం జిల్లా పర్యటనలో బిజీగా ఉన్నారు. నిన్న సాయంత్రం బాపట్లలో జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ.. జగన్‌ను తూర్పారబట్టారు. 

వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పాలనకు, జగన్ పాలనకు భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉందని షర్మిల పేర్కొన్నారు. తాను అధికారంలోకి వస్తే పూర్తి మద్య నిషేధం అమలు చేస్తానని జగనన్న అన్నారని, అసలు మద్యమన్నది ఎక్కడా లేకుండా చేస్తానని, ఆ తర్వాతే వచ్చి ఓట్లు అడుగుతానని అన్నారని గుర్తు చేశారు. మేనిఫెస్టో తనకు బైబిల్, ఖురాన్, భగవద్గీతతో సమానమన్నారని గుర్తు చేశారు. 

నాలుగు రోజుల క్రితం రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందని ఓ అన్నను అడిగితే ‘‘ఏం మద్యపాన నిషేధమమ్మా, ఇప్పుడు సర్కారే మద్యం అమ్ముతోంది. ప్రభుత్వం ఏది అమ్మితే అదే కొనాలి. భూమ్‌భూమ్, స్పెషల్ స్టేటస్ వంటివే దొరుకుతాయి తల్లీ’’ అన్నాడని షర్మిల గుర్తు చేసుకున్నారు. ప్రత్యేక హోదా సంగతేమో కానీ, స్పెషల్ స్టేటస్ మందుబాటిల్ వచ్చిందని ఎద్దేవా చేశారు.  ఇదే జగనన్న పుణ్యమని, ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే? అని షర్మిల మండిపడ్డారు.

More Telugu News