Virat Kohli: ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లో మూడు, నాలుగవ మ్యాచ్‌లకు కూడా దూరం కానున్న విరాట్ కోహ్లీ!

King Virat Kohli will miss the third and fourth Test matches in the England series
  • వ్యక్తిగత కారణాలతో మరో రెండు టెస్టులకు దూరం కానున్నాడని పేర్కొన్న ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫో రిపోర్ట్
  • 5వ టెస్ట్ ఆడడం కూడా సందేహమేనని వెల్లడి
  • రాజ్‌కోట్ టెస్టులో కేఎల్ రాహుల్ లేదా జడేజా ఆడే అవకాశం ఉందని పేర్కొంటున్న రిపోర్టులు
  • విశ్రాంతి అనంతరం జట్టుకు అందుబాటులోకి రానున్న హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్
భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లకు వ్యక్తిగత కారణాలతో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. మిగతా మ్యాచ్‌ల్లో ఆడతాడా? లేదా? అనే విషయంలో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు. అయితే మూడు, నాలుగవ టెస్ట్ మ్యాచ్‌లకు కూడా అతడు దూరమవనున్నాడని రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

కోహ్లీ రాజ్‌కోట్, రాంచీ టెస్టులకు దూరంగా ఉండనున్నాడని, ఇక చివరి టెస్టులో ఆడడం కూడా సందేహాస్పదంగా ఉందని ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫో ( ESPNCricinfo) రిపోర్ట్ పేర్కొంది. తొలి రెండు టెస్టులకు విరాట్ పేరుని ప్రకటించినప్పటికీ వైదొలిగాడు. వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నట్టు జనవరి 22న బీసీసీఐ ధ్రువీకరించింది. కాగా విరాట్ కోహ్లీ రెండవసారి తండ్రి కాబోతున్నాడని తెలుస్తోంది. ఇదే విషయాన్ని విరాట్ కోహ్లీతో స్నేహపూర్వకంగా ఉండే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఇటీవలే తెలిపాడు.

రాజ్‌కోట్ టెస్టులో జడేజా లేదా కేఎల్ రాహుల్‌కు చోటు!
రాజ్‌కోట్ వేదికగా జరగనున్న మూడవ టెస్ట్ మ్యాచ్‌లో గాయపడిన ఇద్దరు ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలలో ఒకరిని తుది జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇద్దరి మధ్య పోటీ నెలకొనే అవకాశం ఉందని విశ్లేషించాయి. దాదాపు వారం గ్యాప్ తర్వాత మ్యాచ్ ఆరంభం కానుండడంతో ఇద్దరూ జట్టుకి అందుబాటులోకి రానున్నారని పేర్కొంది. జడేజా, రాహుల్ ఇద్దరూ తొలి టెస్టులో గాయాలపాలయ్యారు. దీంతో రెండవ టెస్టుకు దూరమయ్యారు. కాబట్టి ఫిట్‌నెస్ క్లియరెన్స్ లభిస్తే ఇద్దరిలో కనీసం ఒకరినైనా తిరిగి తీసుకునేందుకు అవకాశం ఉందని రిపోర్టులు పేర్కొన్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ బెంగళూరులోని ఎన్‌సీఏలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపాయి. 

మరోవైపు హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ మూడో టెస్టుకు తిరిగి అందుబాటులోకి రానున్నాడు. విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టుకు విశ్రాంతి తీసుకున్న సిరాజ్ అందుబాటులోకి రానున్నాడని రిపోర్టులు పేర్కొన్నాయి. కాగా మూడవ టెస్టు ఫిబ్రవరి 15న రాజ్‌కోట్ వేదికగా ప్రారంభమవనుంది.
Virat Kohli
India Vs England
Cricket
Team India

More Telugu News