Kadiam Srihari: తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకున్నారు: కాంగ్రెస్ గెలుపుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

  • కాంగ్రెస్ అమలు చేయలేని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శ
  • తెలంగాణ కోసం ఆలోచించేది బీఆర్ఎస్సే... పార్లమెంటులో గొంతు వినిపించేది మన పార్టీయే అన్న కడియం
  • లోక్ సభ ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపి హామీల నుంచి కాంగ్రెస్ తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తోందని విమర్శ
BRS MLA Kadiyam Srihari on congress win in telangana

తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకున్నారని అందుకే బీఆర్ఎస్ ఓడిపోయిందని... అదే సమయంలో కాంగ్రెస్ అమలు చేయలేని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ నేత, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. బుధవారం ఆయన జనగామ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు, నాయకుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణ గురించి ఆలోచించే, పోరాడే చిత్తశుద్ధి కలిగినపార్టీ బీఆర్ఎస్ మాత్రమే అన్నారు. మన గొంతును పార్లమెంటులో వినిపించేది మన పార్టీయే అన్నారు. అందుకే రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను మనం గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే అన్నారు. 

కాంగ్రెస్ 420 హామీలతో ప్రజలను మోసం చేసి గెలిచిందని విమర్శించారు. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఎన్నో మాటలు చెప్పారని గుర్తు చేశారు. డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీపై సంతకం చేస్తానని.. కాబట్టి కొత్తగా రుణాలు తీసుకోవాలని రైతులకు చెప్పారని గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు ఆ ఊసే లేదన్నారు. రైతు భరోసా కింద మూడు హామీలను ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీని అయినా నెరవేర్చిందా? అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి 60 రోజులు పూర్తయ్యిందన్నారు.

లోక్ సభ ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపి హామీల నుంచి తప్పించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతోందన్నారు. రేవంత్ రెడ్డి భాష ఆయన వ్యక్తిత్వాన్ని చెబుతుందని.. ముఖ్యమంత్రి తన భాష మార్చుకోవాలని హితవు పలికారు. తెలంగాణ హక్కులను కాపాడాలని, కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను రక్షించాలని ప్రజల పక్షాన పోరాడేందుకు కేసీఆర్ ఈ నెల 13న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

More Telugu News