Harish Rao: హరీశ్ రావు మాట్లాడుతుండగా కరెంట్ కట్... మార్పు వచ్చిందంటూ సెటైర్లు

  • జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న హరీశ్ రావు
  • కరెంట్ పరిస్థితి గురించి వివరిస్తుండగా పోయిన పవర్
  • జనరేటర్ ఆన్ చేయడంతో ప్రసంగం ప్రారంభించిన హరీశ్ రావు
Harish rao satires on power cut issue

జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఈ రోజు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతుండగా కరెంట్ పోయింది. దీంతో కాంగ్రెస్ రాగానే మార్పు వచ్చిందంటూ ఆయన సెటైర్ వేశారు. ఈ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న కరెంట్ పరిస్థితి గురించి వివరించారు. హరీశ్ రావు కరెంట్ పరిస్థితి గురించి వివరిస్తున్న సమయంలోనే విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో మార్పు వచ్చిందంటూ ఆయన సెటైర్‌ వేశారు. దీంతో సభ నవ్వులతో నిండిపోయింది. జనరేటర్ ఆన్ చేయడంతో హరీశ్ రావు తిరిగి ప్రసంగం కొనసాగించారు.

కేసీఆర్‌కు జనగామ అంటే అమితమైన ప్రేమ

కేసీఆర్‌కు జనగామ అంటే అమితమైన ప్రేమ అని హరీశ్ రావు అన్నారు. ఎప్పుడూ ఈ ప్రాంతం గురించి ప్రస్తావన తెస్తుంటారని చెప్పారు. మనకు ఉద్యమాలు, అరెస్టులు కొత్త కాదన్నారు. చంద్రబాబు, వైఎస్ హయాంలో నిర్బంధాలను చూసిన గడ్డ జనగామ అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా.. మనది ఎప్పుడూ ప్రజాపక్షమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నేటికి రెండు నెలలు పూర్తయిందన్నారు. 100 రోజుల్లో అమలు చేస్తానన్న హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని... రూ.4వేల పింఛన్ ఇస్తామని ఊదరగొట్టారని.. కానీ ఉన్న రెండు వేల పెన్షన్‌ను కూడా కట్‌ చేశారని ఆరోపించారు.

కేసీఆర్ పాలనలో రైతుబంధు ఆగిన సందర్భాలు లేవన్నారు. వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందే రూ.15 వేలు ఇస్తామన్నారని... కానీ ఉన్న రూ.10 వేలు పోయిందని విమర్శించారు. నిరుద్యోగ భృతిపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతిపై అసెంబ్లీలో భట్టిని నిలదీస్తే సమాధానం లేదన్నారు. రెండు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు మోసాలు చేసిందని విమర్శించారు. హామీల అమలులో సీఎం రేవంత్ రెడ్డి ఎగవేత, దాటవేత వైఖరిని ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కోడ్ వస్తే హామీలకు ఎగనామం పెట్టాలనేది కాంగ్రెస్ నేతల ప్రయత్నమన్నారు.

More Telugu News