USA: అమెరికాలో హైదరాబాదీ యువకుడిపై దాడి.. ఫోన్, వాలెట్ ఎత్తుకెళ్లిన దుండగులు

  • అమెరికాలోని షికాగోలో ఫిబ్రవరి 4న ఘటన
  • బాధితుడు మార్కెట్ నుంచి వస్తుండగా చుట్టుముట్టి దుండగుల దాడి 
  • ముష్టిఘాతాలు కురిపిస్తూ, తన్నుతూ ఇష్టారీతిన దాడి
  • భారత విదేశాంగ శాఖ సాయం అర్థించిన బాధితుడి కుటుంబం
Hyderabad student attacked in Chicago family appeals Indian government for help

అమెరికాలో చదువుకుంటున్న ఓ హైదరాబాదీ యువకుడిపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి ఫోన్, వాలెట్ దొంగిలించారు. దీంతో, బాధితుడి కుటుంబ సభ్యులు భారత ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. అతడికి సరైన వైద్యం అందేలా చూడాలంటూ విజ్ఞప్తి చేశారు. 

పూర్తి వివరాల్లోకి వెళితే, నగరానికి చెందిన సయ్యద్ మజర్ అలీ షికాగోలోని ఇండియానా వెస్లెయాన్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు. స్థానికంగా ఉన్న వెస్ట్ రిడ్జి అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు. ఫిబ్రవరి 4న బాధితుడి అపార్ట్‌మెంట్ ‌సమీపంలోనే అతడిపై దాడి జరిగింది. ‘‘ఆహారం కొనుక్కుని ఇంటికి వెళుతుండగా నలుగురు నన్ను చుట్టుముట్టి దాడి చేశారు. నన్ను తన్నారు, ముష్టిఘాతాలు కురిపించారు. ఆ తరువాత నా ఫోన్ తీసుకుని పోరిపోయారు. నాకు సాయం చేయండి’’ అంటూ అతడు ఓ వీడియో ద్వారా అర్ధించాడు. ఈ దాడిలో మజర్ అలీ రక్తసిక్తమయ్యాడు. పలుచోట్ల గాయాలయ్యాయి. కళ్లపై ముష్టిఘాతాలు కురిపించారని, ముఖం, ఛాతి, వీపుపై ఇష్టారీతిన తన్నారని చెప్పాడు. ఫోన్‌తో పాటు వాలెట్ కూడా తీసుకుని వెళ్లిపోయారని అన్నాడు. 

కాగా, ఈ ఘటనపై హైదరాబాద్‌లో ఉంటున్న అలీ భార్య, ముగ్గురు పిల్లలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తన భర్త వద్దకు వెళ్లేందుకు సాయం చేయాలంటూ బాధితుడి భార్య విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్‌కు విజ్ఞప్తి చేసింది.

More Telugu News