Varun Tej: బాబాయ్ తో సినిమా అంటే కథ కుదరాలి: వరుణ్ తేజ్

Varun Tej said if there is a perfect story he will do it with Pawan Kalyan
  • వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా ఆపరేషన్ వాలంటైన్
  • శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం
  • మార్చి 1న విడుదల
  • హైదరాబాద్ మల్లారెడ్డి కాలేజీలో ప్రమోషన్ ఈవెంట్
  • హాజరైన వరుణ్ తేజ్

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త చిత్రం ఆపరేషన్ వాలంటైన్. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన మానుషి చిల్లర్  కథానాయిక కాగా, శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించారు. భారత వాయుసేన నేపథ్యంలో, యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 1న రిలీజ్ కానుంది. విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ఆపరేషన్ వాలంటైన్ చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరం చేసింది. 

ఈ క్రమంలో హైదరాబాద్ శివార్లలోని మల్లారెడ్డి కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలో హీరో వరుణ్ తేజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాబాయ్ పవన్ కల్యాణ్ తో నటించాలన్న కోరిక తనకు కూడా ఉందని, అయితే అందుకు మంచి కథ కుదరాలని అన్నారు. కథ దొరికితే బాబాయ్ తో సినిమా చేస్తాను అని తెలిపారు. 

ఇక, ఆపరేషన్ వాలంటైన్ చిత్రం గురించి చెబుతూ, వాయుసేన నేపథ్యంలో తెలుగులో వస్తున్న మొదటి చిత్రం ఇదే అయ్యుంటుందని అన్నారు. కామెడీ సినిమాలు వంద చేసినా, దేశం కోసం చేసిన సినిమా ఎంతో గొప్పగా ఉంటుందని వరుణ్ తేజ్ అభిప్రాయపడ్డారు. 

ఇటీవల ఓ ఇంటివాడైన వరుణ్ తేజ్ తన అర్ధాంగి లావణ్య త్రిపాఠి పేరును కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. మీ అభిమాన హీరోయిన్ ఎవరని ప్రశ్నించగా, నా అభిమాన హీరోయిన్ నే నేను పెళ్లి చేసుకున్నాను అంటూ చమత్కరించారు. లావణ్య తర్వాత తాను ఎక్కువగా అభిమానించే హీరోయిన్ సాయిపల్లవి అని చెప్పారు. మంచి కథలు దొరికితే లావణ్య, తాను కలిసి నటిస్తామని వరుణ్ తేజ్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News