Mallu Bhatti Vikramarka: కేసీఆర్‌కు నీళ్ల గురించి అవగాహన లేదు: మల్లు భట్టి విక్రమార్క

  • నీళ్లు, ప్రాజెక్టుల గురించి తెలియదు కాబట్టే కూలిపోయే కాళేశ్వరంను నిర్మించారని విమర్శ
  • నీళ్ళు, నిధుల పేరుతో కేసీఆర్‌కు దోచుకోవడం మాత్రమే తెలుసునని ఆరోపణ
  • తప్పు చేసిన వారిని బొక్కలో వేస్తామని హెచ్చరిక
Mallu Bhatti Vikramarka fires at KCR over irrigation projects

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు నీళ్ల గురించి అవగాహన లేదని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి నీళ్లు, ప్రాజెక్టుల మీద అవగాహన లేదన్న కేసీఆర్ వ్యాఖ్యలకు మల్లు భట్టి కౌంటర్ ఇచ్చారు. అసలు కేసీఆర్‌కే అవగాహన లేదన్నారు. నీళ్ల గురించి... ప్రాజెక్టుల గురించి తెలియదు కాబట్టే కూలిపోయే కాళేశ్వరంను నిర్మించారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి అవగాహన ఉంది కాబట్టి శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ నిర్మించామని గుర్తు చేశారు. నీళ్ళు, నిధుల పేరుతో కేసీఆర్‌కు దోచుకోవడం మాత్రమే తెలుసునని ఆరోపించారు. 

బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో నిర్వహించే సభకు ముందే తెలంగాణ ప్రజలకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో తెలంగాణను నాశనం చేశారని ధ్వజమెత్తారు. నల్గొండలో సభ పెట్టడం కాదని... కేసీఆర్ కృష్ణా జలాలపై చర్చకు రావాలని సవాల్ చేశారు.

తప్పు చేసిన వారిని బొక్కలో వేస్తామని హెచ్చరించారు. కేసీఆర్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలన్నారు. తాము అడిగిన ప్రశ్నలకు కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పడం లేదని విమర్శించారు. కేసీఆర్ వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లిందని మండిపడ్డారు. ఏకంగా ప్రాజెక్టులే కూలిపోతున్నాయన్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో కాళేశ్వరంపై విజిలెన్స్ నివేదికను ప్రవేశపెడతామన్నారు.

More Telugu News