Siddaramaiah: ట్రాఫిక్ కు ఆటంకం కలిగించారంటూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు కోర్టు ఫైన్

  • 2022లో రోడ్డుపై ధర్నా చేపట్టిన కాంగ్రెస్ నేతలు
  • అప్పటి మంత్రి కేఎస్ ఈశ్వరప్ప రాజీనామా, అరెస్టుకు డిమాండ్
  • ట్రాఫిక్ నిలిచిపోవడానికి కారకులయ్యారంటూ కోర్టు ఆగ్రహం
  • ప్రజాప్రతినిధులు ఇలా వ్యవహరించడం ఆమోదయోగ్యం కాదన్న కోర్టు 
  • సిద్ధరామయ్య తదితరులకు రూ.10 వేల జరిమానా
Karnataka High Court imposes fine on CM Siddaramaiah

ట్రాఫిక్ కు ఆటంకం కలిగించారంటూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు హైకోర్టు రూ.10 వేల జరిమానా విధించింది. 

బీజేపీ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్యకు నాటి మంత్రి కేఎస్ ఈశ్వరప్ప కారకుడు అని, ఆయనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సిద్ధరామయ్య సహా, కాంగ్రెస్ నేతలు రోడ్డుపై ధర్నాకు దిగారు. మంత్రి రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టారు. 

2022లో జరిగిన ఈ ధర్నా సందర్భంగా సిద్ధరామయ్య, ప్రస్తుత రవాణా మంత్రి రామలింగారెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి రణదీప్ సూర్జేవాలా ట్రాఫిక్ నిలిచిపోవడానికి కారణమయ్యారంటూ కేసు నమోదైంది. 

ఈ కేసులో విచారణ చేపట్టిన కోర్టు సీఎం సిద్ధరామయ్య, తదితర కాంగ్రెస్ నేతలపై జరిమానా వడ్డించింది. అందులోనూ ప్రజాప్రతినిధులు అయ్యుండి ట్రాఫిక్ కు అవాంతరాలు కలిగించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని కర్ణాటక హైకోర్టు అభిప్రాయపడింది. ఈ కేసును కొట్టివేయాలని సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. 

అంతేకాదు, సీఎం సిద్ధరామయ్య మార్చి 6న ప్రజా ప్రతినిధుల కోర్టులో విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది.

More Telugu News