Seethakka: సమ్మక్క-సారలమ్మ జాతరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించాం: మంత్రి సీతక్క

  • మేడారంలో జరుగుతోన్న అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రులు సీతక్క, పొన్నం
  • దేశంలోనే టిక్కెట్ లేని దేవాలయమన్న మంత్రి సీతక్క
  • ప్రతి ఒక్కరూ అమ్మవార్లను దర్శించుకోవాలని సూచన
  • దేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించిన మంత్రులు
droupadi murmu invited for Sammakka Sarakka fest

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఆహ్వానించినట్లు తెలంగాణ మంత్రి సీతక్క తెలిపారు. సోమవారం నాడు మేడారంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఇక్కడ జరుగుతోన్న పనులను పరిశీలించారు. ఆర్టీసీ బస్సుల పార్కింగ్ ప్రదేశాలను మంత్రులు తనిఖీ చేశారు. ఆ తర్వాత పార్కింగ్ ప్రదేశాల నుంచి సమ్మక్క, సారలమ్మ దేవతల గద్దె వరకు ఆర్టీసీ బస్సులో మంత్రులు ప్రయాణించారు. మేడారం జాతరకు వచ్చే బస్సులు, వెళ్లే పార్కింగ్ స్థలాలు, బస్ షెల్టర్లు , క్యూలైన్ వార్డులు, ఆర్టీసీ ఉద్యోగుల షెల్టర్లు మంత్రులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఉన్నతాధికారులు వివరించారు. ఆ తర్వాత మంత్రులు అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. అనంతరం సీతక్క మాట్లాడారు.

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారంకు జాతీయ హోదా దక్కుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జాతర ఉంటుందన్నారు. ఆ నాలుగు రోజులు దేవతలు గద్దెలపై కొలువై ఉంటారన్నారు. బహుశా దేశంలో ఎలాంటి టిక్కెట్ లేని దేవాలయం ఇదొక్కటే కావొచ్చు అన్నారు. కుల, మత వివక్ష లేదని... అందరూ వన దేవతలను దర్శించుకోవచ్చని పేర్కొన్నారు. జాతర పనుల్లో నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్లను పక్కన పెట్టినట్లు తెలిపారు. గత జాతరలో 2800 బస్సులు మాత్రమే నడిపారని... ఈసారి 6000 బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు.

More Telugu News