Narendra Modi: విపక్షాల కోరికను భగవంతుడు నెరవేరుస్తాడని భావిస్తున్నా: ప్రధాని మోదీ

  • పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగం
  • రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ
  • ప్రసంగించిన ప్రధాని మోదీ
  • విపక్షాలు చాలాకాలం పాటు విపక్షంలోనే ఉండాలనుకుంటున్నాయన్న ప్రధాని
Modi pot shots on opposition parties

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై నేడు చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. విపక్షాలు చాలా కాలం పాటు విపక్షంలోనే ఉండాలని సంకల్పం తీసుకున్నాయని ఎద్దేవా చేశారు. విపక్షాల కోరికను భగవంతుడు నెరవేరుస్తాడని భావిస్తున్నా అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. 

ఎన్నికల తర్వాత విపక్ష నేతలు ప్రేక్షకుల సీట్లకు పరిమితమవుతారని మోదీ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓటమి కోసమే ప్రతి పక్షాలు తీవ్రంగా కష్టపడుతున్నాయని అన్నారు. ఎన్నికలు ఏ విధంగా ఎదుర్కోవాలో తెలియని స్థితిలో విపక్షాలు ఉన్నాయని ఎత్తిపొడిచారు. 

ప్రజాస్వామ్యంలో విపక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని, కానీ మన విపక్షాల తీరు పట్ల దేశ ప్రజలు తీవ్ర నిరాశ చెందారని మోదీ పేర్కొన్నారు. జాతి మొత్తం ఆరోగ్యకరమైన ప్రతిపక్షాన్ని కోరుకుంటోందని, నేటి విపక్షాల దుస్థితికి కాంగ్రెస్ పార్టీయే జవాబుదారీ అని స్పష్టం చేశారు. 

వారసత్వం అనేది కాంగ్రెస్ దుకాణం మూసివేతకు కారణమవుతోందని అన్నారు. పార్లమెంటులో ఉన్నంతకాలం ఏదైనా మంచి చేయడానికి ప్రయత్నించాలని మోదీ హితవు పలికారు. 

రాజ్ నాథ్ సింగ్, అమిత్ షాలకు సాంత పార్టీలు ఏమీ లేవని... కానీ కాంగ్రెస్ లో వారసత్వ పాలనకు ఖర్గే, ఆజాద్ వంటి వారు బాధితులయ్యారని విమర్శించారు. ఆజాద్ ఏకంగా పార్టీని వదిలి వెళ్లారని వివరించారు. ఒకే నేతను కాంగ్రెస్ అదే పనిగా జనంపై రుద్దే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.

More Telugu News