TTD: హిందూ మతంలో చేరే వారి కోసం తిరుమలలో ప్రత్యేక వేదిక

Special establishment for who wished to take Hindu religion
  • తిరుమల ఆస్థాన మండపంలో ముగిసిన ధార్మిక సదస్సు
  • మూడ్రోజుల పాటు జరిగిన సదస్సు
  • మీడియాకు వివరాలు తెలిపిన టీటీడీ చైర్మన్ భూమన
తిరుమలలోని ఆస్థాన మండపంలో టీటీడీ ఆధ్వర్యంలో మూడ్రోజుల పాటు నిర్వహించిన ధార్మిక సదస్సు ముగిసింది. ఈ సదస్సుపై టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

అన్య మతస్తులు ఎవరైనా హిందూ మతంలో చేరాలని ఆసక్తి చూపితే, వారి కోసం తిరుమలలో ఒక వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. దేశంలో మరెక్కడా ఇలాంటి వేదిక లేదని తెలిపారు. హిందూ మతంలో చేరాలనుకుని వచ్చే వారికి ఈ వేదిక ద్వారా పవిత్ర జల ప్రోక్షణంతో స్వాగతిస్తారని వివరించారు. 

తిరుమలలో నిర్వహించిన ధార్మిక సదస్సులో 62 మంది పీఠాధిపతులు పాల్గొన్నారని, వారి సూచనలు, సలహాలతో ఈ సదస్సులో మొత్తం 19 నిర్ణయాలు తీసుకున్నామని భూమన వివరించారు. సామాజిక మాధ్యమాల్లోనూ హిందూ ధార్మిక కార్యక్రమాల ప్రచారం చేపడతామని, స్కూల్ విద్యార్థులకు కూడా హైందవ ధర్మం విశిష్టత, ఆవశ్యకత తెలియజేసేలా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తామని భూమన వెల్లడించారు. 

తిరుమల స్థాయిలో తిరుపతి నగరాన్ని కూడా ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. యువతలో ధార్మిక భావనలు పెంపొందించేందుకు ప్రత్యేకంగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తామని అన్నారు.
TTD
Hindu Religion
Tirumala
Bhumana Karunakar Reddy
Andhra Pradesh

More Telugu News