Prashant Kishor: లోక్ సభ ఎన్నికల్లో బీహార్‌లో బీజేపీ కూటమి అన్ని స్థానాలు గెలుచుకుంటుంది: ప్రశాంత్ కిషోర్

  • బీజేపీ, జేడీయూ కూటమి 40 సీట్లు గెలుచుకుంటుందని జోస్యం
  • బీహార్‌‌లో ఎక్కువమంది ఓటర్లు ఆర్జేడీకి ఓటు వేసేందుకు ఆసక్తి చూపరని వ్యాఖ్య
  • నితీశ్ కుమార్ కలిసినా... కలవకపోయినా బీజేపీ 40 సీట్లు గెలుస్తుందన్న ప్రశాంత్ కిషోర్
  • నితీశ్ కలవడానికి ముందే ఎన్డీయే మరింత మెరుగైన స్థితిలో ఉందని వ్యాఖ్య
Prashant Kishor Makes Bold Prediction For Bihar Lok Sabha

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీహార్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అన్ని స్థానాలు గెలుచుకొని క్లీన్ స్వీప్ చేస్తుందని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ, ఎల్‌జేపీ కలిసి పోటీ చేశాయి. 40 లోక్ సభ స్థానాలకు గాను ఈ కూటమి 39 సీట్లు గెలుచుకుంది. లోక్ సభ ఎన్నికల తర్వాత బీజేపీకి దూరమైన నితీశ్ కుమార్... మళ్ళీ ఇటీవలే దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ బీహార్ గెలుపుపై ఓ ఇంటర్వ్యూలో తన అంచనాలను వెల్లడించారు.

బీహార్‌లో ఎన్డీయే కూటమి అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు. ప్రధాని మోదీ ప్రజాదరణ... ఎన్డీయే కూటమి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో అధికారంలో ఉండటం... సరైన ప్రతిపక్షం లేదా ప్రత్యామ్నాయం లేనందున అధికార కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు. బీహార్‌లో ఎక్కువమంది ఓటర్లు ఆర్జేడీకి ఓటు వేసేందుకు ఆసక్తి చూపించరని వ్యాఖ్యానించారు. గతంలో 20 ఏళ్ల జంగిల్ రాజ్, అధికార దుర్వినియోగం వంటి వివిధ కారణాలతో ఆర్జేడీ పట్ల ప్రజలు నాటి నుంచి అసంతృప్తితో ఉన్నారన్నారు. ప్రశాంత్ కిషోర్ మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. నితీశ్ కుమార్ కలిసినా... కలవకపోయినా... బీజేపీ 40 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందన్నారు.

నితీశ్ కుమార్ విశ్వసనీయతలేని భాగస్వామి అని ప్రశాంత్ కిషోర్ గతంలో విమర్శించారు. ఇండియా కూటమిని దారుణంగా ఓడించాలనే ఉద్దేశ్యంతో బీజేపీ... నితీశ్ కుమార్‌తో కలిసిందని... కానీ నితీశ్ కుమార్ లేనప్పుడు బీజేపీ మరింత మెరుగైన స్థితిలో ఉందన్నారు. నితీశ్ కుమార్ తన రాజకీయ జీవితాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. బీజేపీ, జేడీయూ మధ్య పొత్తు 2025 అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగకపోవచ్చునని జోస్యం చెప్పారు.

More Telugu News