Team India: విశాఖ టెస్టులో టీమిండియా విన్నర్... 106 రన్స్ తో ఇంగ్లండ్ ఓటమి

  • విశాఖలో టీమిండియా, ఇంగ్లండ్ రెండో టెస్టు
  • మూడున్నర రోజుల్లోనే ముగిసిన మ్యాచ్
  • రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 292 ఆలౌట్
  • బుమ్రా 3, అశ్విన్ 3 వికెట్లతో రాణించిన వైనం
Team India beat England by 106 runs in Visakha test

హైదరాబాద్ లో ఎదురైన ఓటమికి టీమిండియా విశాఖలో ప్రతీకారం తీర్చుకుంది. ఇంగ్లండ్ తో ఇక్కడి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 399 పరుగుల లక్ష్యంతో నేడు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ చివరికి 292 పరుగులకు ఆలౌట్ అయింది. 

ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ పోరాడినప్పటికీ, విశాఖ పిచ్ పై టీమిండియా బౌలర్లను నిరోధించలేకపోయారు. బుమ్రా 3, అశ్విన్ 3 వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. ముఖేశ్ కుమార్ 1, కుల్దీప్ యాదవ్ 1, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు. 

ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో జాక్ క్రాలే 73, బెన్ ఫోక్స్ 36, టామ్ హార్ట్ లే 36, బెన్ డకెట్ 28, రెహాన్ అహ్మద్ 23, జానీ బెయిర్ స్టో 26 పరుగులు చేశారు. నేడు నాలుగో రోజు లంచ్ తర్వాత టామ్ హార్ట్ లేను బుమ్రా బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ కు తెరపడింది. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. యశస్వి జైస్వాల్ (209) అద్భుత డబుల్ సెంచరీ సాయంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 396 పరుగులు చేసింది. ఆ తర్వాత ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 253 పరుగులకే ఆలౌటై టీమిండియాకు కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సమర్పించుకుంది. 

అనంతరం, శుభ్ మాన్ గిల్ (104) సమయోచిత సెంచరీ సాధించగా, టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 255 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో విజయంతో టీమిండియా 5 టెస్టుల సిరీస్ ను 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు ఫిబ్రవరి 15 నుంచి రాజ్ కోట్ లో జరగనుంది.

More Telugu News