Shivaji: 90's సిరీస్ కి అంతకంతకూ పెరుగుతున్న ఆదరణ!

  • ఈటీవీ విన్ నుంచి 90's సిరీస్ 
  • శివాజీ ప్రధాన పాత్రగా సాగే కథ
  • ఓ మిడిల్ క్లాస్ బయోపిక్ ఇది 
  • ఆకట్టుకునే కథాకథనాలు 
  • గతంలోకి తీసుకుని వెళ్లే ఎమోషనల్ కంటెంట్

Etv Win Series

ఈటీవీ విన్ ద్వారా '90's ఎ మిడిల్ క్లాస్ బయోపిక్' సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శివాజీ - వాసుకి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ ఎలాంటి హడావిడి లేకుండా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి అడుగుపెట్టింది. ఈ సిరీస్ 6 ఎపిసోడ్స్ గా అందుబాటులోకి వచ్చింది. ఫస్టు ఎపిసోడ్ చూసినవారెవరూ చివరి ఎపిసోడ్ వరకూ చూడకుండా ఉండలేరు. అంత ఆసక్తికరంగా ఈ సిరీస్ కొనసాగుతుంది. 

ఇది 90లలో జరిగే కథ. చంద్రశేఖర్ - రాణి భార్యాభర్తలు .. వాళ్లది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వారి సంతానంగా ఇద్దరు మగపిల్లలు - ఒక ఆడపిల్ల. ఆదాయాన్ని బట్టి ఖర్చు అనే పాలసీతో చంద్రశేఖర్ ముందుకు వెళుతుంటాడు. అతని పధ్ధతికి తగినట్టుగా రాణి నడుచుకుంటూ వెళుతూ ఉంటుంది. టీనేజ్ కి దగ్గరలో ఉన్న పిల్లలు కావడంతో వాళ్ల ఆశలు .. సరదాలు వాళ్లవి. స్నేహం .. ఆకర్షణ .. చదువు .. ఇంట్లో అసహనం .. అమ్మానాన్నలు అర్థం చేసుకోవడం లేదనే అసంతృప్తికి మధ్య వాళ్లు ఊగిసలాడుతూ ఉంటారు. 

ఈ సిరీస్ చూస్తూ చాలామంది తమ గతంలోకి వెళతారు. ముఖ్యంగా చంద్రశేఖర్ పాత్రను మలిచిన తీరు ఆకట్టుకుంటుంది. ఒక మధ్యతరగతి తండ్రి కుటుంబం పట్ల ఎంతటి బాధ్యతను కలిగి ఉండాలి? పిల్లల చదువుల పట్ల ఎలాంటి దృష్టి పెట్టాలి? వాళ్లు మానసిక పరమైన ఒత్తిడికి లోనైనప్పుడు ఎలా చేరదీయాలి? ఆడపిల్లకి ఎలా ధైర్యాన్ని నూరిపోయాలి? అనే అంశాలను దర్శకుడు ఆవిష్కరించిన తీరు మనసుకు హత్తుకుంటుంది .. అక్కడక్కడా కళ్లను తడి చేస్తుంది. 

తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలి .. వాళ్లు నొచ్చుకుంటే ఓదార్చాలి. ఏ విషయానికి ప్రాధాన్యత ఇవ్వాలో .. దేనికి ఇవ్వకూడదో చెప్పాలి. ఏది మంచి - ఏది చెడు .. ఏ మార్గంలో వెళితే ఏం దక్కుతుందనేది అర్థమయ్యేలా వివరించాలి. పిల్లలు కూడా తల్లిదండ్రులు మనసును అర్థం చేసుకుని నడచుకోవాలనే విషయాన్ని అందంగా .. అర్థవంతంగా చెప్పిన సిరీస్ ఇది. అందుకే రోజు రోజుకీ ఫ్యామిలీ ఆడియన్స్ ను అభిమానులుగా చేసేసుకుంటూ ముందుకు వెళుతోంది.

More Telugu News