Jharkhand floor test: ఝార్ఖండ్‌లో నేడే బలపరీక్ష

  • అసెంబ్లీలో బలపరీక్ష నెగ్గేందుకు మేజిక్ ఫిగర్ 41
  • జేఎమ్ఎమ్ సారథ్యంలోని అధికార కూటమికి 46 మంది ఎమ్మెల్యేలు
  • బీజేపీ సారథ్యంలోని కూటమి ఎమ్మెల్యేలు 29 
  • బలపరీక్షలో జేఎమ్ఎమ్ విజయం లాంఛనమే అంటున్న పరిశీలకులు
JMM to face floor test today

ఝార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్టు నేపథ్యంలో నేడు అధికార జేఎమ్‌ఎమ్ పార్టీ అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోనుంది. హేమంత్ సోరెన్ తరువాత చంపయి సోరెన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రిసార్ట్ పాలిటిక్స్‌కు తెరలేపిన అధికార జేఎమ్ఎమ్ పార్టీ హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఉన్న ఎమ్మెల్యేలను బలపరీక్ష కోసం ఆదివారం రాష్ట్ర రాజధాని రాంచీకి రప్పించింది. అయితే, అధికార పార్టీకి ఉన్న మెజారిటీ దష్ట్యా విజయం లాంఛనమే అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అసాధారణ ఘటనలు ఏమైనా జరిగితే తప్ప జేఎమ్ఎమ్ నుంచి అధికారం చేజారదని పరిశీలకులు చెబుతున్నారు. 

రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 81 స్థానాలు ఉండగా ఒక స్థానం ఖాళీగా ఉండటంతో మేజిక్ ఫిగర్ 41గా ఉంది. జేఎమ్ఎమ్ సారథ్యంలోని అధికార కూటమికి మొత్తం 46 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జేఎమ్ఎమ్‌ ఎమ్మెల్యేలు 28 మంది కాగా కాంగ్రెస్‌కు 16, ఆర్జేడీ, సీపీఐ(ఎమ్ఎల్)కు చేరో ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఇక బీజేపీ, దాని మిత్రపక్షాలకు కలిపి 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 

అయితే, బలపరీక్ష ఎదుర్కోవడం జేఎమ్ఎమ్‌కు ఇదే తొలిసారి కాదు. 2022 సెప్టెంబర్‌లో జరిగిన బలపరీక్షలో 48 మంది ఎమ్మెల్యేల మద్దతుతో జేఎమ్ఎమ్ అధికారం కైవసం చేసుకుంది. అప్పట్లోనూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న హేమంత్ సోరెన్ సభా బహిష్కరణ ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. 

ప్రస్తుత ముఖ్యమంత్రి చంపయి సోరెన్‌కు పార్టీతో పాటు సోరెన్ కుటుంబం మద్దతు కూడా ఉంది. 90ల్లో ప్రత్యేక ఝార్ఖండ్ రాష్ట్ర సాధన కోసం ఆయన శిబూ సోరెన్‌తో కలిసి ఉద్యమించారు. హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు.

More Telugu News