Balka Suman: సీఎం రేవంత్‌ రెడ్డి‌పై బాల్క సుమన్ ఆగ్రహం

  • సీఎం రేవంత్‌ రెడ్డి త‌న స్థాయిని త‌గ్గించుకుని మాట్లాడుతున్నారని మండిపాటు
  • కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం బీఆర్ఎస్‌కు లేదన్న మాజీ ఎమ్మెల్యే
  • డిసెంబ‌ర్ 9వ తేదీన చేస్తామ‌న్న రుణ‌మాఫీ ఏమైందని కాంగ్రెస్‌ను ప్రశ్నించిన బాల్క సుమన్
Balka Suman made hot comments on CM Revanth Reddy and Congress Party

ఆదివారం జరిగిన చెన్నూరు నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి త‌న స్థాయిని త‌గ్గించుకుని మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రజ‌లు ఇచ్చిన ప్రతిప‌క్ష పాత్రను స‌మ‌ర్థవంతంగా నిర్వహిస్తామని, ప్రభుత్వాన్ని కూల్చే అవ‌స‌రం బీఆర్ఎస్‌కు లేదని అన్నారు. ప్రతిపక్షంలో ప్రజల గొంతుక‌గా నిలుస్తామని స్పష్టం చేశారు. 

ప్రజల‌కు అత్యాశ చూపి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల‌ను అమలు చేసేలా ఒత్తిడి తీసుకువ‌స్తామని హెచ్చరించారు. డిసెంబ‌ర్ 9వ తేదీన చేస్తామ‌న్న రుణ‌మాఫీ, రూ.4 వేలు పెన్షన్, రూ.500లకే గ్యాస్ సిలిండర్, మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండ‌ర్‌లకు సంబంధించిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేకపోయిందని అన్నారు.

చెన్నూరు నేలపై మళ్లీ గులాబీ జెండా ఎగ‌రే వ‌ర‌కు నియోజకవర్గమే తన ఇలాకా అని ఆయన స్పష్టం చేశారు. తన ఇల్లే అడ్డా అని అన్నారు. తాను చెన్నూరు విడిచి వెళ్లిపోతానంటూ దుష్ర్పచారం చేస్తున్నారని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. 

గ‌త ఎన్నిక‌ల్లో చెన్నూరు అభ్యర్థి‌గా వివేక్ ఇచ్చిన హామీలు అన్నింటినీ నెర‌వేర్చాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్‌ది కుటుంబ పాల‌నైతే వినోద్, వివేక్ ఎమ్మెల్యేలు ఎలా అయ్యారని ప్రశ్నించారు. కొడుకు వంశీకి ఎంపీ టిక్కెట్టు కోసం వివేక్ ఆశ‌ప‌డ‌టం కుటుంబ పాల‌న కాదా? అని మండిపడ్డారు. వివేక్‌ను చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గానికి నిధులు తీసుకుర‌మ్మంటే త‌న కొడుకు ఎంపీ సీటు కోసం ఢిల్లీ, హైద‌రాబాద్‌లో బిజీగా ఉంటున్నారని ఆరోపించారు. 

సింగ‌రేణి బొగ్గు బావుల‌ను అదానీకి అప్పగించేందుకు రేవంత్‌ - వివేక్ ఒప్పందం కుదుర్చుకున్నారని బాల్క సుమన్ ఆరోపించారు.

More Telugu News