Revanth Reddy: ప్రగతిభవన్ లో జగన్, కేసీఆర్ మధ్య చీకటి ఒప్పందం జరిగింది: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy alleges there was a deal between Jagan and KCR
  • నీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్
  • జగన్ తో ఒప్పందం వల్లే కేసీఆర్ కేఆర్ఎంబీ సమావేశానికి వెళ్లలేదని ఆరోపణ
  • కమీషన్లకు లొంగి జలదోపిడీకి సహకరించారని ఆగ్రహం
  • కేసీఆర్ హయాంలోనే రాయలసీమ, ముచ్చుమర్రి ప్రాజెక్టులు మొదలయ్యాయని వెల్లడి
నీటి ప్రాజెక్టుల అంశంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం హైదరాబాదులో మీడియా సమావేశం నిర్వహించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపు పెంచారని వెల్లడించారు. పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపునకు కేసీఆర్, హరీశ్ రావు సహకరించారని పేర్కొన్నారు. 

ఇక, రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నీటి తరలింపునకు ఏపీ సీఎం జగన్ ప్రణాళిక వేశాడని తెలిపారు. 2020 మే 5న రాయలసీమ ఎత్తిపోతలకు జీవో ఇచ్చారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. శ్రీశైలం నుంచి నీళ్లే కాదు, బురద కూడా ఎత్తిపోసుకునేలా జగన్ యత్నాలు ఉన్నాయని విమర్శించారు. 

రోజుకు 8 టీఎంసీల నీరు తరలించుకుపోవాలన్నది జగన్ ప్రణాళిక అని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో ఏపీకి 8 టీఎంసీల నీరు తరలించడానికి కేసీఆర్ అనుమతించారని... ప్రగతిభవన్ లోనే జగన్, కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 

జగన్ తో చీకటి ఒప్పందం మేరకే కేఆర్ఎంబీ సమావేశానికి కేసీఆర్ హాజరు కాలేదని, ఒప్పందం మేరకే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును కేసీఆర్ వ్యతిరేకించలేదని ఆరోపించారు. రాయలసీమ, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలకు కేసీఆర్ సహకరించారని స్పష్టం చేశారు. 

కేసీఆర్ హయాంలోనే రెండు ప్రాజెక్టులు మొదలయ్యాయని... కేసీఆర్ పదవులు, కమీషన్లకు లొంగి జలదోపిడీకి సహకరించారని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Revanth Reddy
KCR
Jagan
KRMB
Congress
BRS
Telangana
Andhra Pradesh

More Telugu News