Padma awardees: పద్మ పురస్కార గ్రహీతలకు ప్రభుత్వ సన్మానం

Telangana govt honours Padma award winners at Shilpakala Vedika
  • వెంకయ్య నాయుడు, చిరంజీవిలను సన్మానించిన సీఎం రేవంత్ రెడ్డి
  • హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో కార్యక్రమం
  • రూ.25 లక్షల నగదు పురస్కారం ప్రకటించిన ప్రభుత్వం
  • నంది అవార్డును గద్దర్ అవార్డులుగా మార్చడంపై చిరంజీవి హర్షం
ఈ ఏడాది పద్మ పురస్కారాలకు ఎంపికైన వారిని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగస్టార్ చిరంజీవిలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాలువా, మెమెంటోలతో సత్కరించారు. వీరితో పాటు పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, ఆనందాచారి, కేతావత్‌ సోమ్‌లాల్‌, కూరెళ్ల విఠలాచార్యలను సీఎం ఘనంగా సన్మానించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున వారిని సత్కరించినట్లు చెప్పారు. అవార్డు అందుకోనున్న ఈ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల నగదు పురస్కారం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కళాకారులను గౌరవించే రాజ్యం సుభిక్షం: చిరంజీవి
కళాకారులను సముచితంగా గౌరవించే రాజ్యం ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉంటుందని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చిరంజీవిని పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపిక చేయడంతో తెలంగాణ ప్రభుత్వం ఆయనను సన్మానించింది. శిల్పకళావేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికయ్యానని తెలిసిన క్షణంలో చాలా సంతోషం కలిగిందని అన్నారు. అభిమానుల ఆశీర్వాదం చూస్తుంటే తన జన్మధన్యమైనట్లు అనిపిస్తోందని అన్నారు. పద్మ పురస్కారాలు ప్రకటించిన తర్వాత కూడా సన్మానం చేయాలనే ఆలోచన ఇంతవరకూ ఎవరికీ రాలేదన్నారు.

ప్రభుత్వం ప్రభుత్వం ముందుకొచ్చి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం, పద్మ పురస్కారం అందుకోనున్న వారికి సముచితంగా గౌరవించడం గొప్ప కార్యక్రమమని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కొన్నేళ్లుగా నంది అవార్డులు ఇవ్వకపోవడంపై నిరుత్సాహం వ్యక్తం చేసిన మెగాస్టార్.. తాజాగా నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మెచ్చుకున్నారు. ఇకపై ఏటా గద్దర్ అవార్డులు ఇస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనను స్వాగతించారు. కళాకారులకు అందించే పురస్కారాలు వారికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాయని పేర్కొన్నారు.

Padma awardees
Govt Honour
Shilpa kala vedika
Chiranjeevi
Venkaiah Naidu
Padma awards
Revanth Reddy
Telangana Govt

More Telugu News